'వెంకటాద్రి ఎక్స్ప్రెస్'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి దక్షిణాదితో పాటు...ఇటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకుందీమె. ఇటీవలే 'భారతీయుడు 2'తో తెరపై సందడి చేసిన ఈమె.. తక్కువ కాలంలోనే అద్భుతమైన కథానాయకులతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్..చిత్రపరిశ్రమలోకి రావడం గురించి కొన్ని ఆసక్తికర సంగతుల్ని పంచుకుంది. ''నాకు వచ్చిన ఈ గొప్ప అవకాశానికి అదృష్టం అనే పదం సరియైనదో కాదో తెలియదు. కానీ.. నేను సినీరంగం నుంచి వచ్చిన వ్యక్తిని కానప్పటికీ..
ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో రుణపడి ఉంటాను. తక్కువ కాలంలోనే ఉత్తమమైన అగ్రకథానాయకులతో పనిచేసే అవకాశం లభించింది. విభిన్నమైన పరిశ్రమలలో పనిచేస్తూ.. భిన్నమైన వ్యక్తుల నుంచి కొత్త విషయాల్ని నేర్చుకునే మంచి అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. నాకు తెలిసి జీవితంలో ఇలాంటి ఊహించని పరిణామాలకు ఒక ప్రణాళిక అంటూ ఏమీ ఉండదు. కెరీర్లో మరో మెట్టు ఎదగడానికి ఇవి తోడ్పతాయని అనుకుంటున్నాన''ని చెప్పుకొచ్చింది.