పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 12 ఏళ్ల క్రితం వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం గబ్బర్‌సింగ్. బండ్ల గణేష్ నిర్మాత. శ్రుతీహాసన్ కథానాయిక. సెప్టెంబర్ 2న పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలయ్యే అన్ని థియేటర్స్‌లో అడ్వాన్స్ బుకింగ్‌తో హౌస్‌ఫుల్ అయిపోయాయి. ఒకటో తేది రాత్రి కూడా ప్రీమియర్స్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ "రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో చాలా సినిమాలు విడుదలవుతుంటే సోషల్ మీడియాలో హంగామా చూసి అప్పట్లో 'గబ్బర్‌సింగ్’ ఇదంతా మిస్ అయిందే అనే వెలితి ఉండేది. బండ్ల గణేష్, సత్యనారాయణ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తూ ఆ వెలితిని పూడ్చేశారు. గబ్బర్‌సింగ్ రీ రిలీజ్ అని ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో హడావిడికి హద్దే లేదు. అభిమానులు చాలా ఆనందిస్తున్నారు. గబ్బర్‌సింగ్ చరిత్రలో ఉండే సినిమా కాదు.. ఆ సినిమా అంటేనే ఓ చరిత్ర. మా అందరి జీవితాలను మార్చేసిన సినిమా ఇది. గబ్బర్‌సింగ్ వచ్చిన సమయంలో సినిమా బావుంటే హిట్ అని, చాలా బావుంటే సూపర్‌హిట్ అని, అంతకుమించి ఉంటే బ్లాక్‌బస్టర్ హిట్ అని, అదీ దాటిపోతే గబ్బర్‌సింగ్ అని సోషల్ మీడియా ఓ నానుడి ఉండేది. ఇది ఫ్యాన్స్ రాసింది. కల్యాణ్‌గారు జయాపజయాల గురించి పట్టించుకోరు. అయితే ఈ సినిమా క్లాప్ కొట్టిన రోజు నుంచి ఫస్ట్ వరకూ ఇది బ్లాక్‌బస్టర్ అని లక్షల సార్లు జపం చేసిన వ్యక్తి బండ్ల గణేష్. ఆయన సంకల్పం గట్టిది.. అందుకే ఇంత విజయం అందుకున్నాం. హిట్ అంటే ఆయన ఒప్పుకునేవారు కాదు.. మనం తీసేది హిట్ గురించి కాదు..బ్లాక్‌బస్టర్ అనేవారు. సెట్‌లో నేను ఎంత కష్టపడ్డానో.. అంతకుమించి సెట్ బయట గణేష్ కష్టపడ్డారు. సినిమా సక్సెస్‌ను ఊహించిన వ్యక్తి పవన్‌కల్యాన్‌గారు. మరో పుష్కర కాలం తర్వాత వచ్చినా ఈ సినిమా ట్రెండ్ ఇలాగే ఉంటుంది’’ అని అన్నారు.