కోలీవుడ్ హీరో జయం రవి ఇటీవలే తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తనకు తెలియకుండానే తన భర్త ఇలాంటి ప్రకటన చేశారని..అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించినా వీలు కావడంలేదని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది ఆర్తి. పెళ్లైయిన 15 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. తన అనుమతి లేకుండానే విడాకుల ప్రకటన ఇచ్చారని.. వాటి గురించి మాట్లాడేందుకు జయం రవిని కలవడానికి ప్రయత్నించినప్పటికీ.. తనను అనుమతించడం లేదని చెప్పుకొచ్చింది. అయితే ప్రముఖ సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ కారణంగానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. కొన్నాళ్లుగా జయం రవి సదరు గాయనితో ప్రేమలో ఉన్నారనే ప్రచారం నడిచింది. అయితే తన గురించి వస్తున్న రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని.. ఈ అసత్య ప్రచారంలోకి మరొకరిని లాగొద్దని .. ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్ లైఫ్‌గా ఉండనివ్వాలని అన్నారు. ఈ విషయం పై మీడియాతో జయం రవి మాట్లాడుతూ.. “నేను ఒక్కటి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను.. నా విడాకుల విషయంలో ఎవరి పేరు వచ్చినా అది నిజం కాదు.. దయచేసి నా వ్యక్తిగత జీవితాన్ని నా వ్యక్తిగత జీవితంగా ఉండనివ్వండి. నా పర్సనల్ లైఫ్ లోకి మరొకరిని తీసుకురాకండి” అని అన్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా తన భార్య ఆర్తిపై జయం రవి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. తన పర్సనల్ అసిస్టెంట్ ద్వారా రెండ్రోజుల క్రితం అడయార్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో భార్య ఆర్తిపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తనను ఆర్తి ఇంటి నుంచి గెంటివేసిందని.. చెన్నైలోని ఆర్తి ఇంట్లో ఉన్న తన వస్తువులను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును నీలాంగర పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.
తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయం రవి. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన జయం రవి.. ఆర్తి ఇద్దరు చిరకాల స్నేహితులు. ఆర్తి సీరియల్ నిర్మాత కూతురు. వీరిద్దరు 2009 జూన్ 4న ఇరు కుటుంబాల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అయాన్, ఆరవ్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.