మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ 'అమరన్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 5 నుంచి ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ వర్గాలు తెలిపాయి.
ఐదేళ్ల వయసు నుంచే సైనికుడు కావాలనేది ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) కల. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు రెబెకా వర్ఘీస్ (సాయిపల్లవి)తో ప్రేమలో పడతాడు. ఇంతలో భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్ అధికారిగా ఉద్యోగానికి ఎంపికవుతాడు. ట్రైనింగ్ అనంతరం 22 రాజ్‌పుత్ రెజిమెంట్‌లో విధుల్లో చేరతాడు. ముకుంద్ ఇంట్లో వీళ్ల ప్రేమని ఒప్పుకొన్నా... ఇందు ఇంట్లో తిరస్కారం ఎదురవుతుంది. అయినా సరే పట్టు వదలకుండా ఇందు కుటుంబసభ్యుల్ని ఒప్పించి ఒక్కటవుతారు. ఆ ఇద్దరి వ్యక్తిగత జీవితం ఎలా సాగింది? ముకుంద్ వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నాడు? మేజర్‌గా పదోన్నతి పొంది రాజ్‌పుత్ రెజిమెంట్ నుంచి.. రాష్ట్రీయ రైఫిల్స్‌కి డిప్యుటేషన్‌పై వచ్చాక ఆయన ఎలాంటి ఆపరేషన్లని నిర్వహించాడనేది సినిమాలో చూడాల్సిందే.