కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. అందులో 'మీరు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్' అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా.. భర్తతో విభేదాలా లేక సీరియల్స్ మూవీస్‌కు దూరంగా ఉండటమా అనే దానిపై విచారణ చేస్తున్నారు.నటనకు దూరంగా ఉండటం, అవకాశాలు లేకపోవడం వల్ల కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. శోభిత మృతిపై ఆయన మీడియాతో మాట్లాడారు. శోభితది ఆత్మహత్య అని విచారణలో వెల్లడైందన్నారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందన్నారు.దొరికిన ఆధారాలను బట్టి ఆత్మహత్యగా తేల్చామన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాలేదన్నారు. ఆత్మహత్యకు ముందు డైరీలో ఏమైనా రాసుకుందా? స్నేహితులకు ఏమైనా సందేశం పంపించిందా? అని చెక్ చేస్తున్నామన్నారు.భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.