ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ హాజరైన అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాతలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 08:30 PM

తెలుగు సినీ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప-2 ది రూల్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రెండ్రోజుల్లోనే రెండు ఆల్ టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ నేపథ్యంలో, పుష్ప-2 చిత్రబృందం నేడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్, రవిశంకర్, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ తన డైరెక్షన్ టీమ్ ను పేరుపేరునా పరిచయం చేశారు. పుష్ప-2 మేకింగ్ లో వారు తనకు ఎలా సహాయపడిందీ వివరించారు. అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. మొదట "థాంక్యూ ఇండియా... ఇవాళ నేను చెప్పాల్సింది ఇదే" అంటూ తన స్పీచ్ ప్రారంభించారు. పుష్ప-2 చిత్రానికి తిరుగులేని విజయం అందించారని తెలిపారు. ఇవాళ థాంక్యూ చెప్పడమే తనకు ప్రధాన విషయం అని అన్నారు. "ఈ సినిమాకు పనిచేసిన నా టెక్నీషియన్లందరికీ, ఆర్టిస్టులందరికీ... నన్ను, సుకుమార్ ను నమ్మి మాకోసం ఎంతో డబ్బు ఖర్చుపెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్లిన నవీన్, రవిశంకర్, చెర్రీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సినిమా అంటే అందరి కష్టం ఉంటుంది. కానీ అందరికీ హిట్ ఇచ్చేది ఒక వ్యక్తి... అతడే దర్శకుడు. ఇవాళ నాకు పేరొచ్చినా, నిర్మాతలకు పేరొచ్చినా, ఆర్టిస్టులకు పేరొచ్చినా... ఆ ఘనత పూర్తిగా సుకుమార్ కే దక్కుతుంది. ఇవాళ నాకు ఇన్ని కాంప్లిమెంట్లు వస్తున్నాయంటే ఆయనే కారణం. డార్లింగ్ (సుకుమార్)... ఇంతకంటే నేను ఇంకేం చెప్పగలను! తీసుకెళ్లి అంత ఎత్తులో కూర్చోబెట్టావు నన్ను. నేను ఇది అహంకారంతో చెప్పడంలేదు... దయచేసి ఎవరూ తప్పుగా అనుకోవద్దు. ఈ సినిమా కలెక్షన్లు ఎంతో కూడా నాకు సరిగా తెలియదు. అంకెలు పక్కన పెట్టేస్తే... మనం ఒక చిన్న ప్రాంతీయ సినీ పరిశ్రమలో ప్రస్థానం ప్రారంభించాం. కానీ ఇవాళ మన చిత్రం దేశంలోనే టాప్ గ్రాసర్ గా నిలిచిందంటే అది చాలా పెద్ద విషయం. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులకు, నిర్మాతలకు, దర్శకుడికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి" అని పేర్కొన్నారు. ఇక, ఇతర రాష్ట్రాలను కూడా సందర్శించి పుష్ప-2 విజయోత్సవాల్లో పాల్గొంటామని అల్లు అర్జున్ చెప్పారు. ఇక, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందడంపైనా బన్నీ స్పందించారు.గత 20 ఏళ్లుగా తాను సినిమా రిలీజ్ సందర్భంగా షో చూస్తుంటానని, పుష్ప-2 చిత్రం సంధ్య థియేటర్ లో చూస్తున్నప్పుడు బయట ఓ మహిళ మృతి చెందడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఈ విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "మేం సినిమాలు చేసేదే ప్రేక్షకులు థియేటర్ వచ్చి ఎంజాయ్ చేయడానికి... కానీ, అలా సినిమా చూసేందుకు వచ్చిన ఓ కుటుంబానికి విషాదం కలగడం బాధాకరం. ఆ కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించాం... ఆ కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పాం. వారి కుటుంబానికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయలేకపోవచ్చు... కానీ అన్ని విధాలా అండగా ఉంటాం" అని అల్లు అర్జున్ వివరించారు. ఈ సక్సెస్ మీట్ చివర్లో నిర్మాత రవిశంకర్ వేదికపైకి వచ్చి ఆసక్తికర అంశం వెల్లడించారు. తాము రెండ్రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ను రూ.449 కోట్లు అని ప్రకటించామని, కానీ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు ఫోన్ చేసి అప్ డేట్ చేసిన సమాచారం అందించారని, పుష్ప-2 రెండ్రోజుల గ్రాస్ రూ.500 కోట్లు దాటిపోయిందని ప్రకటించారు. ఇక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తమకు పర్సనల్ గా ఎంతో సాయం చేశారని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని నిర్మాత రవిశంకర్ పేర్కొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com