పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యజమాని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఈ థియేటర్ యజమాని రేణుకా దేవి ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై రేవతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో థియేటర్ యజమాని హైకోర్టుకు వెళ్లారు.రేవతి మృతితో తమకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ప్రీమియర్, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. పుష్ప-2 సినిమాకు తాము ప్రీమియర్ షోలు నిర్వహించలేదన్నారు. డిస్ట్రిబ్యూటర్లే నేరుగా సినిమాను నడిపించుకున్నట్లు చెప్పారు. అయినప్పటికీ తమవంతుగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. కానీ తమపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఇది అన్యాయమని అందులో పేర్కొన్నారు.