మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో మంచు విష్ణు తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. ఇది మా కుటుంబ విషయం. ఈ విషయంలో భాగమైన బయటవాళ్లకు ఈరోజు సాయంత్రం వరకూ అవకాశం ఇస్తున్నా. వాళ్లంతట వాళ్లే వెనక్కి తగ్గాలి. లేదంటే వాళ్ల పేర్లు నేనే బయటపెడతా’ అని విష్ణు హెచ్చరించారు.మాది ఉమ్మడి కుటుంబం. మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా. దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపెడుతోంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు. ప్రతీ కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. కాబట్టి, ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకువెళ్లడం కరెక్టే కానీ, కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. ఈరోజు అమ్మ ఆస్పత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి.
కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్ వచ్చింది. అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశాను. అన్నింటికంటే కుటుంబం ముఖ్యం. నిన్న ఉదయాన్నే హైదరాబాద్ వచ్చా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఊర్లో లేని నాలుగు రోజుల్లో ఇది అంతా జరిగిపోయింది. నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్‌కు గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. ఉద్దేశపూర్వకంగా మేము ఎవరినీ బాధ పెట్టాలనుకోలేదు. నమస్కారం చేసుకుంటూనే నాన్న మీడియా ముందుకు వచ్చారు. ముఖంపై మైక్ పెట్టగానే క్షణికావేశంలో ఆయన దాడి చేశారు. ఆ విలేకరి కుటుంబంతో నేను ఫోన్‌లో మాట్లాడా. అవసరమైన సాయం చేస్తా’’ అని విష్ణు తెలిపారు.