ఇటీవల శోభితతో నాగచైతన్య వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో వీరిద్దరూ వారి పరిచయం, ప్రేమ గురించి మాట్లాడారు. మొదటిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లినట్లు శోభిత తెలిపారు. 2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలైనట్లు తెలిపారు. తెలుగుతో మా బంధం మెరుగైంది.. 2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్యను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నట్లు శోభిత తెలిపారు. 'నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను, చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించే మా అభిప్రాయాలు పంచుకునేవాళ్లం. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య నన్ను తరచూ అడిగేవారు. అలా మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపడింది. నేను ఎప్పుడూ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటా. నేను పెట్టే గ్లామర్ ఫొటోలు కాకుండా .. స్ఫూర్తిమంతమైన కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్‌లను నాగచైతన్య లైక్ చేసేవారు' అని అన్నారు. 11 రోజుల్లో 'పుష్ప' కలెక్షన్ల విధ్వంసం.. రూ.2వేల కోట్లు సాధిస్తుందా? మొదటి మీట్ ఎక్కడంటే.. మొదటిసారి ముంబయిలోని ఓ కేఫ్‌లో చైతన్యను కలిసినట్లు శోభిత చెప్పారు. ''అప్పుడు చైతన్య హైదరాబాద్, నేను ముంబయిలో ఉండేవాళ్లం. నాకోసం హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చేవారు. మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్లో ఉన్నాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటినుంచి జరిగినదంతా అందరికీ తెలిసిన విషయమే'' అని నటి గుర్తుచేసుకున్నారు. గోవాలో పెళ్లి ప్రపోజ్.. నాగచైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకలకు తనను ఆహ్వానించినట్లు శోభిత తెలిపారు. ఆ మరుసటి సంవత్సరం తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు చెప్పారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిపారు. అందుకే తెలుగులో మాట్లాడమని అడిగా: నాగచైతన్య శోభితను తెలుగులో మాట్లాడమని తాను ఎప్పుడూ అడిగేవాడినని నాగచైతన్య అన్నారు. 'సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులను కలుస్తుంటాం. వారిలో తెలుగులో మాట్లాడేవారిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వాళ్లతో త్వరగా కనెక్ట్ అవుతాను. శోభిత పరిచయం అయ్యాక నాతో తెలుగులోనే మాట్లాడాలని తరచూ అడిగేవాడిని' అని చెప్పారు.