రాకింగ్ స్టార్ యష్ ‘కెజియఫ్’ ఫ్రాంచైజీ చిత్రాలతో గ్లోబల్ రేంజ్ స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాల తర్వాత ఆయన చేసే సినిమా కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తనని ఇంతడి వాడిని చేసిన అభిమానులపై యష్ ఎంతో కృతాజ్ఞతాభావంతో ఉంటారు. అందుకే త్వరలో తన పుట్టినరోజు రానున్న తరుణంలో.. అభిమానులకు తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన యష్, వారికి ఓ ప్రత్యేకమైన లేఖను రాశారు.ఈ లేఖలో.. ఈ ఏడాది పూర్తవుతున్నందున అందరూ వేడుకలను నిర్వహించుకునే వారు, అలాగే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే అభిమానులు అందరూ ఆరోగ్యం, భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ లెటర్‌లో యష్ పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనటం కంటే అభిమానులు వారి గొప్ప లక్ష్యాలను చేరుకుంటున్నారని తెలిసి ఎంతో సంతోషపడతానని యష్ ఈ సందర్భంగా తెలియజేశారు. యష్ తన అభిమానులను ఉద్దేశించి రాసిన హృదయపూర్వక లేఖలో ప్రేమను వ్యక్త పరిచే విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. అలా ఎందుకు ఆయన చెప్పారంటే..గతంలో తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో యష్ పుట్టినరోజు సందర్భంగా.. కర్ణాటకలో గదగ్ జిల్లాలో ముగ్గురు అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో యష్ ప్రమాదంలో చనిపోయిన అభిమానుల కుటుంబాలను ప్రత్యేకంగా వెళ్లి కలిసి నివాళులు అర్పించటమే కాకుండా, ఆ కుటుంబాలకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన తర్వాత తనకు బ్యానర్స్‌ను కట్టటం, ప్రమాదకరమైన బైక్ చేజింగ్‌ల్లో పాల్గొనటం, నిర్లక్ష్యపు సెల్ఫీలు తీసుకోవటం మానుకోవాలని యష్ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు చేయటమనేవి.. నిజమైన అభిమానాన్ని చూపినట్లు కాదని అభిమానులకు ఆయన సూచనలిచ్చారు.‘మీరు నా నిజమైన అభిమాని అయితే మీ పనిని మీరు శ్రద్ధగా చేయండి, మీ జీవితం మీదే, సంతోషంగా ఉండండి, విజయవంతంగా ముందుకెళ్లండి’ అని మీడియాలో తన అభిమానులకు యష్ రిక్వెస్ట్ చేశారు. 2019లో ఓ అభిమాని యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని కలవాలనుకుని, కలవలేకపోయిన ఓ అభిమాని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ సందర్భంలోనూ ఇలాంటి చర్యలు సరైనవి కావని అభిమానులకు యష్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తన పుట్టినరోజు (Jan 8) రానున్న సందర్భంగా ఈసారి యష్, తన అభిమానుల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వారు సురక్షితంగా ఉండటమే తనకు లభించిన గొప్ప బహుమతి అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ బర్త్‌డేకు తను షూటింగ్‌లో బిజీగా ఉంటానని తెలుపుతూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.యష్ ప్రస్తుతం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్’ సినిమా చేస్తున్నారు. ఈ భారీ ప్రతిష్టాత్మకమైన ఎంటర్‌టైనర్‌ను కె.వి.ఎన్.ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె.నారాయణ, యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa