కాంతారావు... వెండితెరను ఏలిన ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు తరువాత వినిపించే పేరు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సినిమా పరిశ్రమకి వెళ్లిన ఆర్టిస్టుల సంఖ్య ఎక్కువ. తెలంగాణ ప్రాంతం నుంచి మద్రాస్ వెళ్లినవారు చాలా తక్కువమందే అని చెప్పవచ్చు. అలా తెలంగాణ నుంచి వెళ్లిన తొలితరం నటుడు కాంతారావు. ఎన్టీఆర్ - ఏఎన్నార్ వంటి మహామహులను తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడిన జానపద కథానాయకుడు ఆయన. అలాంటి కాంతారావు ప్రతిభను గుర్తించడంలో... సన్మానించుకోవడంలో ఎక్కడో ఏదో లోపం జరుగుతూనే వచ్చిందనే ఒక అసంతృప్తి ఆయన అభిమానులలో ఉంది. ఆయన పుట్టిపెరిగిన గ్రామస్తులు మాత్రం ఆయనను ఇంతవరకూ మరిచిపోలేదు. ఒక యూట్యూబ్ ఛానల్ వారు కాంతారావు ఊరు వెళ్లినప్పుడు, ఆయన గురించిన విషయాలను పంచుకోవడానికి అక్కడివారు చూపిన ఉత్సాహమే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాంతారావు ఇల్లు శిథిలావస్థలో ఉండటం చూస్తే ఆయన అభిమానులకు కన్నీళ్లు రాకుండా ఉండవు. జీవితంలో చాలామంది చాలా పొరపాట్లు చేస్తారు... అందువలన ఆర్ధికంగా నష్టపోతుంటారు. అలాగే కాంతారావు సినిమాలు నిర్మించి నష్టపోవచ్చు. కానీ ఆర్ధికంగా అలా చితికిపోయిన ఆయనకి అందినది చాలీచాలని సాయమే. ఒక్క ఫోన్ కాల్ తో అన్నీ చక్కబెట్టగలిగిన కుబేరులున్న ఇండస్ట్రీ, కాంతారావు విషయంలో మిన్నకుండి పోవడం గురించే అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంతారావు వ్యసనాలతో డబ్బు పోగొట్టుకోలేదు. ఆయన ఆడతాయనుకున్న సినిమాలు ఆడలేదు అంతే. అంతకుముందు ఆయన పిసినారి కూడా కాదు. ఊళ్లో ఆయన తండ్రి పేరుతో ఉన్నచెరువు... ఆలయ నిర్మాణానికి కాంతారావు ఇచ్చిన స్థలం... ఆయన చేసిన దానధర్మాలు గురించి స్థానికులు చెబుతున్నారు. ఎంతో కష్టపడిన కాంతారావుకి చివరికి మిగిలింది కత్తి గాయాలే అని చెప్పుకున్నారు. కానీ ఆయన చేసిన దానధర్మాలు కూడా బతికే ఉన్నాయి. అంతటి నటుడికి సొంత ఇల్లు ఏర్పాటు చేయకపోవడం... సొంత ఊళ్లోని ఆయన ఇంటిని కాపాడుకోలేకపోవడం ఎవరి వైఫల్యమనేది ప్రశ్నించుకునే తీరిక ఎవరికి ఉంది?
![]() |
![]() |