హీరోయిన్ కాజల్ పేరుతో ఓ మోసగాడు ఏకంగా రూ.60 లక్షలు దోచేశాడు. కాజల్ అంటే అతడికి వీరాభిమానం. ఆ అభిమానమే అతడి కొంపముంచింది. డబ్బు పొగొట్టుకునేలా చేసింది. ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. కాజల్ అగర్వాల్ ని విపరీతంగా అభిమానించే ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.60 లక్షలు పోగొట్టుకున్న ఘటన సంచలనంగా మారింది. విడతల వారిగా సైబర్ నేరగాళ్లు అతని నుంచి రూ.60 లక్షలు లాగేశారు. ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగితే డొంక కదలింది. అసలు విషయం బయటకు వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని రామనాథపురం ప్రాంతానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమారుడికి కాజల్ అంటే పిచ్చి. ఎలాగైనా కాజల్ ని కలవాలని, మాట్లాడాలని అనుకునేవాడు. అలా ఒక రోజు ఇంటర్నెట్‌లో చాట్ చేస్తుండగా.. అతడికి ఓ ప్రకటన కనిపించింది. మీకు బాగా ఇష్టమైన స్టార్‌తో డేటింగ్ చేసే అవకాశం కల్పిస్తామని అందులో ఉంది. దానికి అట్రాక్ట్ అయిన అతడు వెంటనే క్లిక్ చేసి తన ఫొటో, పూర్తి వివరాలు ఇచ్చాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి అతనికి కాజల్‌ను పరిచయం చేస్తానని చెప్పాడు. అందుకోసం ముందుగా రూ.50 వేలు అడిగాడు. అడిగింది ఆలస్యం ఆ వ్యక్తి వెంటనే డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకొంత నగదు డిమాండ్ చేశాడు. ఇలా విడతల వారీగా నగదు ఇస్తూనే పోయాడు.
ఎన్నిరోజులైనా అవతలి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఆన్‌లైన్ లో సంప్రదించాడు. అప్పటినుంచి అతడికి వేధింపులు మొదలయ్యాయి. ఆ యువకుడి ఫోటోను మహిళలతో నగ్నంగా ఉన్నట్లు మార్ఫింగ్ చేశారు దుండగులు. వాటిని నెట్ లో పెడతామని, కుటుంబసభ్యులకు పంపిస్తామని బెదిరించారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిపోయిన బాధితుడు మూడు విడతలుగా రూ.60లక్షలు సమర్పించుకున్నాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయాడు. తన కోసం వెతకొద్దని, ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కోల్‌కతాలో ఉన్నాడని తెలుసుకుని అక్కడి పోలీసుల సాయంతో యువకుడిని రక్షించారు చెన్నై పోలీసులు.
యువకుడు చెప్పిన వివరాల ఆధారంగా సైబర్ నేరంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు డబ్బులు పంపిన అకౌంట్ వివరాలతో విచారణ జరపగా.. శివగంగై జిల్లా దేవకొట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ది అని తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకేమీ తెలీదని.. తన స్నేహితుడు శరవణకుమార్ అప్పుడప్పుడు తన ఖాతాకు డబ్బు పంపిస్తుంటే దాన్ని డ్రా చేసి అతడికిస్తుంటానని చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడు శరవణను చెన్నైలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.9లక్షలు మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన సొమ్మును క్రికెట్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు శరవణ తెలిపాడు. ఈ కేసుతో ప్రమేయమున్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa