ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబమంతా కలిసిఉండాలన్నదే నా అభిమతం

cinema |  Suryaa Desk  | Published : Sun, May 25, 2025, 07:22 PM

తన కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని భోజనం చేసే రోజు రావాలని, అందరూ ఆప్యాయంగా కౌగిలించుకుని మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నటుడు మంచు మనోజ్ అన్నారు. ఆ రోజు కోసం దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తన తండ్రి మోహన్ బాబు.. తన కుమార్తెను ఎత్తుకుంటే చూడాలన్నది తన కోరిక అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రంటే తనకెంతో ఇష్టమని, ఆయనపై ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశారు. ‘భైరవం’ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మనోజ్, ఇటీవల చోటుచేసుకున్న కుటుంబ పరిణామాలపై తన మనసులోని మాటలను పంచుకున్నారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన తల్లిని చాలా మిస్ అవుతున్నానని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. "అమ్మను కలవాలంటే కొన్ని షరతులు పెట్టారు. ఆమెను కలవడానికి అనుమతి తీసుకోవాలి. లేదంటే నేను వెళ్తే, ఆమె ఇంటి బయటకు వచ్చి నన్ను కలవాలి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు" అని అన్నారు. తన తల్లి కూడా తమను ఎంతగానో మిస్ అవుతోందని, అప్పుడప్పుడు తమ వద్దకు వస్తుంటుందని, తన పాప అంటే అమ్మకు ఎంతో ఇష్టమని చెప్పారు.గొడవల కారణంగా తన సోదరిని కూడా దూరం పెట్టాల్సి వచ్చిందని మనోజ్ తెలిపారు. ఇటీవల ఆమె ఆధ్వర్యంలో జరిగిన ‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమానికి తాను వస్తానో రానో కూడా ఆమెకు తెలియదని, కేవలం ఆమె కోసమే ఆ కార్యక్రమానికి వెళ్లానని అన్నారు. "ఇంతకాలం నేను ఏమైపోతానోనని తను ఎంతో భయపడింది. దేవుడి దయ, నా పిల్లలు, అభిమానులు ఇచ్చిన ధైర్యంతో నిలబడ్డాను" అని వివరించారు.కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడుతూ "నీపై ఆధారపడిన కుటుంబం ఉన్నప్పుడు, ఎదుటివాళ్లు కత్తులతో దాడికి వస్తుంటే, నీ ముందు ఒక కత్తి పడి ఉంటే ఏం చేస్తావు? వాళ్లు వచ్చి దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటావా? లేక నీ వాళ్ల కోసం కత్తి ఎత్తుతావా? ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని దెబ్బలైనా తట్టుకోవచ్చు. నా జీవితంలోనూ అదే జరిగింది. ఇప్పుడు నాకంటూ మౌనిక, పిల్లలు ఉన్నారు" అని మనోజ్ తెలిపారు. తన భార్య మౌనిక జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొందని, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిందని, అలాంటి బాధ ఎవరికీ రాకూడదని అన్నారు. ఈ గొడవలతో ఆమెకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.ఆస్తి వివాదాల ఆరోపణలపై కూడా మనోజ్ స్పందించారు. "మేము ఇప్పటివరకు ఆస్తి అడగలేదు. అడిగినట్లు నిరూపించమని సవాల్ చేస్తున్నా. గొడవైన వెంటనే నాపై ఫిర్యాదు చేసి, సీసీటీవీ కెమెరాలను మాయం చేశారు. ఇది ఎప్పుడూ జరిగేదే. ఈసారి అందరికీ తెలియాలనే బయటకు వచ్చి చెప్పాను. నిందలు వేసి, వాటిని నిజమని అంగీకరించమంటే నా వల్ల కాదు. నాక్కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను తప్పు చేస్తే దాక్కుంటాను" అని అన్నారు. సమస్యలను కూర్చొని మాట్లాడుకుందామని, గొడవలు వద్దని తాను అంటున్నానని తెలిపారు. వాళ్లు చేసే పనులకు కోపం రావడం లేదని, బాధగా ఉంటుందని, ఇంత జరిగినా వాళ్లను ప్రేమించడం తప్ప ద్వేషించలేదని మనోజ్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa