by Suryaa Desk | Thu, Nov 21, 2024, 02:25 PM
దర్శకుడు వంశీ తన సినిమాలకు సంబంధించిన ముచ్చట్లను అభిమానులతో పంచుకోవడం కోసం 'ఫ్లాష్ బ్యాక్' పేరుతో వీడియోస్ వదులుతున్నారు. అలా ఆయన కొంతకాలంగా 'ఆలాపన' సినిమా సంగతులను చెబుతూ వస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విశేషాలను ఆయన తాజాగా వదిలిన వీడియోలో ఆవిష్కరించారు. మోహన్ - భానుప్రియ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఆలాపన' 1985లో విడుదలైన సంగతి తెలిసిందే. 'ఆలాపన' గురించి వంశీ మాట్లాడుతూ .. "ఈ సినిమా షూటింగు కోసం ఎన్నో లొకేషన్స్ తిరిగాము. ఆ సమయంలో 'చిమిడిపల్లి' స్టేషన్ మాస్టర్ శివరాజ్ గారు తన ఇంట్లో మాకు బస ఏర్పాటు చేశారు. ఆయన .. ఆయన భార్య లీల ఇద్దరికీ కూడా భానుప్రియ ఒక హీరోయిన్ అని తెలియదు. అయినా వాళ్లు ఆమెను .. ఆమె చెల్లెలు శాంతిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను 'అరకు' పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశాము" అని అన్నారు. 'అరకు' సమీపంలో .. రైల్వే ట్రాక్ దగ్గరలో 'బంగారు రంగు' పూల చెట్లు మెరిసిపోతున్నాయి. అక్కడ 'ఆ కనులలో కలల నా చెలి' అనే పాటను చిత్రీకరించాలని అనుకున్నాము. అందుకోసం ఆ పూలచెట్ల మధ్యలో నేలపై 'బండి చక్రం' బిగించాము. ఆ చక్రం అడ్డంగా తిరుగుతూ ఉండగా దానిపై భానుప్రియ నాట్యం చేస్తూ ఉంటుంది. హీరో పాడుతూ ఉంటాడు .. ఆ వెనుకగా ట్రెయిన్ వెళుతూ ఉండాలి .. ఇదీ షాట్". " భానుప్రియ నల్లని డాన్స్ డ్రెస్ వేసుకుని సిద్ధంగా ఉంది. దూరం నుంచి ట్రైన్ సౌండ్ వస్తోంది. బండిచక్రం తిప్పాము .. అది తిరుగుతోంది. ట్రెయిన్ దగ్గరికి వస్తోంది . కెమెరా స్టార్ట్ అయింది. షాట్ పూర్తి కాగానే .. అప్పటివరకూ తిరుగుతూ ఉన్న చక్రంపై ఉన్న కారణంగా భానుప్రియ కళ్లుతిరిగి పడిపోయింది. నిజమే .. తిరుగుతున్న చక్రంపై నిలబడి నాట్యం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఎవరైనా సరే అలా పడిపోకుండా ఉండలేరేమో" అని అన్నారు.
Latest News