వేసవి కాలం సందర్భంగా.. తెలంగాణలో ప్రజలకు కరెంట్ కష్టాలు పలకరిస్తున్నాయి. కేవలం ఇండ్లల్లో ఉండే ప్రజలే కాదు.. మీటింగుల్లో రాజకీయ నాయకులు కూడా కరెంటు కోతలకు భాదితులవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. తెలంగాణలో సమస్యగా మారిన ఈ కరెంట్ కోతలు.. ఇప్పుడు ఐపీఎల్ 2024ను కూడా వదలిపెట్టట్లేదు. ఓవైపు దేశంలో ఐపీఎల్ 2024 ఫీవర్ గట్టిగానే నడుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ టీం.. మొదటి మ్యాచ్‌లోనే సిక్సర్ల వరదపారించి రికార్డు స్కోరును నమోదు చేసి.. క్రికెట్ లవర్స్‌ను ఉర్రూతలూగించింది. అయితే.. శుక్రవారం (ఏప్రిల్ 05) రోజున కూడా ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ మీద మంచి క్రేజ్ ఏర్పడింది.
రేపు రాత్రి ఏడున్నరకు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. విద్యుత్ శాఖ అధికారులు హెచ్‌సీఏకు కరెంట్ షాక్ ఇచ్చారు. రెండు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి చేరుకుని ప్రాక్టిస్ చేస్తుండగా.. ఉన్నట్టుండి స్టేడియానికి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఏంజరిగిందా అని ఆరా తీస్తే.. అధికారులే కావాలని కరెట్ కట్ చేసినట్టుగా తెలిసింది. మరి ఎందుకు కట్ చేశారబ్బా అంటే.. స్టేడియం నిర్వాహకులు కొన్ని నెలలుగా కరెంట్ బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది.
ఈ ఘటనపై హబ్సిగూడ ఎస్‌ఈ రాముడు స్పందించి.. అసలు వివరాలు వెల్లడించారు. విద్యుత్ బిల్లులు చెల్లించకుండా స్టేడియం నిర్వాహకులు విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్టు తెలిపారు. కాగా.. ఇప్పటివరకు మొత్తం రూ.1.67 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. తెలిపారు. 2015లోనే హెచ్‌సీఏ మీద కేసు నమోదు చేశామని.. 15 రోజుల క్రితం మరోసారి నోటీసులు పంపించామని ఎస్ఈ రాముడు తెలిపారు.
ఇదిలా ఉంటే.. విద్యుత్ అధికారులు రేపటి మ్యాచ్ కోసం టికెట్లు అడిగారని.. ఇవ్వకపోవటంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటూ హెచ్సీఏ సిబ్బంది చెప్తున్నట్టు సమాచారం. మరి.. రేపు జరగబోయే కీలక మ్యాచ్‌కు కరెంట్ ఇస్తారా.. లేదా అన్నది అప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్ స్టేడియంలో జరిగేదో అడపాదడపా మ్యాచ్‌లు.. అలాంటిది అవి జరిగే సమయంలోనూ నిర్వాహణా లోపాలు, నిర్లక్ష్యం కారణంగా ప్రతిసారి అవమానాలు మూటగట్టుకుంటోంది హెచ్‌సీఏ. మరి రేపటివరకు బిల్లులు క్లియర్ చేసో, విద్యుత్ అధికారులను బతిమాలో బామాలో కరెంట్ తీసుకొచ్చి గౌరవం కాపాడుకుంటారో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa