తెలంగాణ భవన్‌లో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడిన ఆయన.. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏళ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగించామన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదని.. అలా జరగాలంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
'ప్రజా పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పది సంవత్సరాలు మా ప్రభుత్వం పనిచేసింది. విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే ప్రగతి వస్తుంది, ప్రగతితోనే సమానత్వం వస్తుంది అన్న ఆయన ఆలోచనతో 1022 గురుకులాలు పెట్టుకున్నాం. వీటినుంచి బయటకు వచ్చిన లక్షల పదిమంది భవిష్యత్తు తెలంగాణ పౌరులు ఈరోజు అనేక ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారు. వీరందరూ జీవితంలో పైకి వచ్చినప్పుడు సమాజంలో అసమానతలు తొలగుతాయి.
ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. మేము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు విప్లవం అనే మాటను కేసీఆర్ చెప్పారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడం కేసీఆర్ గారికే సాధ్యమైంది. బాబా సాహెబ్ అంబేడ్కర్ అందరి మనిషి... ఆరోజు మహాత్మ గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు. బడుగు బలహీన వర్గాల కోసం దళిత గిరిజన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా... అవన్నీ కూడా అంబేడ్కర్ ఆలోచన నుంచి వచ్చినవే.
కొలంబియా యూనివర్సిటీలో ఆయనకు ఇచ్చిన ఘనమైన నివాళి మనమందరం గుర్తు తెచ్చుకోవాలి. అంబేడ్కర్ ఆధునిక భారతదేశ జాతిపిత అనేటువంటి మాట చెప్పింది. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్పూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలంతా కలిసి అంబేడ్కర్ ఆలోచనల కోసం ఆయన ఆశయాల కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అందరం కలిసి ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేస్తున్నాను.' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa