కేంద్ర బడ్జెట్ అనగానే సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది ఆదాయపు పన్ను రాయితీల గురించే. బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపులు పొందిన పన్ను చెల్లింపుదారులు, ఇప్పుడు రాబోయే బడ్జెట్ 2026లో కూడా ప్రభుత్వం మరిన్ని ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా పరిణామాలను గమనిస్తున్న ఆర్థిక నిపుణులు మాత్రం ఈసారి ప్రత్యక్ష పన్నుల విషయంలో భారీ మార్పులు ఉండే అవకాశం తక్కువని అభిప్రాయపడుతున్నారు. మరి బడ్జెట్ 2026పై అంచాలను ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
నిపుణుల అంచనాల ప్రకారం.. గత ఏడాది బడ్జెట్ 2025లో టాక్స్ స్లాబ్ రేట్లలో గణనీయమైన మార్పులు జరిగాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయంపై కొంత ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కేవలం ఒక ఏడాది వ్యవధిలోనే మళ్లీ స్లాబ్ రేట్లను సవరించడం ప్రభుత్వానికి ఆర్థికంగా సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఒకవేళ ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భావిస్తే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయ పారామితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా స్లాబ్ రేట్లలో చిన్నపాటి మార్పులు చేసే 'ఆటోమేటిక్ ట్వీక్' పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది జరిగితే పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు లబ్ధి చేకూరుతుంది.
బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను చట్టం 2025ను మరింత సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను విషయంలో స్పష్టతనివ్వడంపై చర్చలు జరుగుతున్నాయి. సార్వభౌమ సంపద నిధులు భారతీయ లిస్టెడ్ కంపెనీల ఈక్విటీల నుంచి వచ్చే లాభాలపై వీటికి పన్ను మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న మినహాయింపులు కేవలం మౌలిక సదుపాయాల రంగానికే పరిమితమై ఉన్నాయి. వీటిని విస్తరించడం ద్వారా భారత్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులను అరికట్టి, దీర్ఘకాలిక స్థిరమైన పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఆదాయపు పన్ను చట్టం 2025 అమలు
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను సులభతరం చేయడం, పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయడంపై బడ్జెట్‌లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. పన్ను విధానంలో పారదర్శకతను పెంచడం ద్వారా వివాదాలను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తం మీద బడ్జెట్ 2026లో సామాన్యులకు పన్ను రేట్ల పరంగా భారీ 'సర్ ప్రైజ్'లు ఉండకపోవచ్చు కానీ, విదేశీ పెట్టుబడులు, చట్టపరమైన సరళీకరణ విషయంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం తన రాబడిని, ప్రజల సంక్షేమాన్ని సమతూకం చేస్తూ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa