ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కొత్త చట్టం.. ఈ నెలలోనే అమల్లోకి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 07:05 PM

సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ముందు నుంచి చెప్తూ వస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు పొంగులేటి ప్రకటించారు. అయితే.. ఈ కొత్త చట్టాన్ని ఈ నెలాఖరులోగా అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.


తెలంగాణలో త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు కొత్త ఆర్వోఆర్ చట్టం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించినట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే.. గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్యలో కూర్చొని ధరణి పోర్టల్‌ను సిద్ధం చేసినట్టుగా కాకుండా.. ఈ కొత్త చట్టం రూపకల్పన విషయంలో ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని పొంగులేటి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ఇప్పటికే చాలా భూసమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వివరించారు. కొత్త చట్టం తీసుకొచ్చి.. అందరి భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


మరోవైపు.. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను గాలికి వదిలేసిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను దసరాలోపు పేద ప్రజలకు అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4 వేల ఇండ్లు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల సలహాలు, సూచనలు కూడా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


అయితే.. అక్టోబర్ 7వ తేదీతో.. ప్రజా ప్రభుత్వం ఏర్పాడి 10 నెలలు పూర్తవుతుందని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. 10 నెలల్లో ప్రజలు కోరుకున్న వాటిని సాధించలేకపోయామని మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలను స్మార్ట్ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఆ స్మార్ట్ కార్డులు కూడా ఈ దసరాలోపే ఇస్తామని తెలిపారు. అర్హతలను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.


రాబోయే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పొంగులేటి ప్రకటించారు. జనవరి నుంచి ఆసరా పెన్షన్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కానీ రైతులకు 13 వేల కోట్ల రూపాయలతో త్వరలోనే డబ్బులు జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa