ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, జాగ్రత్తగా ఉండండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 07:37 PM

తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంది. సెప్టెంబర్ తొలి రెండు వారాలు వానలు దంచికొట్టగా.. ఆ తర్వాత చివరి రెండు వారాలు ఎండల తీవ్రత పెరిగింది. ఇక అక్టోబర్ మాసం తొలివారంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల కారణంగా చెరువులు, కుంటలు, జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఇక ఇప్పుడు వరికోత సీజన్ మెుదలు కాగా.. రైతులకు వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.


ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలపై తాజాగా వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో నేడు జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం,నారాయణపేట, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు.


ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈదురు గాలులతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పలు చోట్ల పిడుగులు కూడా అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని సూచించారు.


ఇక రేపు (మంగళవారం) నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, వికారాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. నేడు హైదరాబాద్‌లో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని.. సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు నగర ప్రజలను హెచ్చరించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa