ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీ.సీ.ఐ. కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2024, 04:40 PM

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని, పత్తి రైతులు ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి, సంకేపల్లి, కోనరావు పేట మండలం సుద్దాలలో ఏర్పాటుచేసిన సి.సి.ఐ. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ పత్తి రైతులు దళారులకు తమ పంటను విక్రయించవద్దని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటికే 200 పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. తేమ శాతం సరిగ్గా ఉన్న ధాన్యాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ధాన్యం నిల్వలకు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ వద్ద ఉన్న గోదాములను పరిశీలించామని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని తెలిపారు. మిగతా రైతులకు కూడా సాంకేతిక సమస్యలతో రుణమాఫీ నిలిచిపోయిన వారి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. రైతు భరోసా కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నామని తెలిపారు. జిల్లాలో పత్తి పండించిన రైతులు తమ పరిధిలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తరలించి విక్రయించాలని పేర్కొన్నారు. 8 శాతం లోపు తేమ ఉంటే, పత్తి క్వింటాల్ కు 7,521 రూపాయలు, అలాగే 8 నుంచి 12 శాతం లోపు ఉన్న పత్తికి 7,200 నుంచి 7,445 మద్దతు ధరగా సీసీఐ నిర్ణయించిందని తెలిపారు. దీంతో రైతులకు తూకం విషయంలో, అలాగే డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఇల్లంతకుంట మండలంలో సిసిఐ ఆధ్వర్యంలో రెండు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని వెల్లడించారు.  రైతులను రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ సీజన్ ముగిసిన తర్వాత రైతుల పొలాలలోని మట్టి పరీక్షలు చేయించి దానికి అనుగుణంగా విత్తనాలు ఎంపిక, ఎరువుల వాడకం త్వరలో చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, సిసిఐ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com