ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి హామీలో అవకతవకలు జరిగితే సహించేదిలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:55 PM

పనితీరు మెరుగుపర్చుకోకపోతే సస్పెండ్‌ చేస్తామని విజయనగరం కలెక్టర్‌ అంబేడ్కర్‌ హెచ్చరించారు. ఇన్నాళ్లూ హెచ్చరికలకే పరిమితం అయ్యాయని, ఇక నుంచి చర్యలు మొదలు పెడుతున్నామన్నారు. ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు, గోకులాలు తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బొబ్బిలి పీఆర్‌ ఏఈ సస్పెన్షన్‌కు, సంబంధిత డీఈ, ఇద్దరు ఏపీవోలకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఉపాధి హామీ మెటిరియల్‌ కాంపోనెంట్‌ కింద సుమారు రూ.280 కోట్ల విలువైన సీసీ, బీటీ రోడ్లు, డ్రైన్లు తదితర 2,851 పనులను మూడు దశల్లో మంజూరు చేశామన్నారు. వీటిల్లో 1171 పనులను మాత్రమే పూర్తి చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు నెలల్లో కేవలం 40 శాతం పనులే చేశారని, నిధుల వినియోగం మరింత అధ్వానంగా ఉందన్నారు. నిధులు వినియోగించకపోతే జిల్లా ప్రజలు నష్టపోతారని చెప్పారు. ఇన్‌చార్జి ఏఈలు ఉన్న చోట ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లను నియమించుకోవాలని సూచించారు. సమావేశంలో పీఆర్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌, డ్వామా పీడీ శారదాదేవి తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com