సాధారణంగా కుంభమేళా అంటే కోట్లాది మంది భక్తులు వస్తారు. ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ జనాల గుంపులో మనతో ఉన్నవారు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని అతని కుటుంబం గుర్తించింది. వెంటనే అతని భార్యకు ఫోటో పంపించగా.. తన భర్తే అని తేల్చింది. దీంతో పరుగు పరుగున ఆ కుంభమేళాకు రాగా.. అతడు మాత్రం వారిని గుర్తు పట్టలేదు. తాను ఒక సాధువును అంటూ చెప్పడం గమనార్హం. కానీ తన భర్తకు ఉన్న అన్ని పోలికలు అతడికి ఉన్నాయని.. అతడే తన భర్త అంటూ ఆ మహిళ వాదిస్తోంది. దీంతో చివరికి పోలీసులకు మొరపెట్టుకుంది. చివరికి డీఎన్ఏ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. ఈ క్రమంలోనే జార్ఖండ్‌కు చెందిన ఓ కుటుంబం కూడా పుణ్యస్నానాల కోసం అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలోనే కుంభమేళాలో కనిపించిన ఓ అఘోర వారిని ఆకర్షించాడు. అతడు తమ కుటుంబ సభ్యుడిలాగే కనిపించాడు. గంగా సాగర్ అనే వ్యక్తి 1998లో తప్పిపోయాడు. అప్పటినుంచి అతని భార్య ధన్వా దేవి, కుటుంబ సభ్యులు కొన్ని ఏళ్ల పాటు ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా కనిపించలేదు. దీంతో అతడు వస్తాడనే ఆశ వదులుకున్నారు.
గంగాసాగర్, ధన్వా దేవి దంపతులకు ఇద్దరు కుమారులు కమలేష్, విమలేష్ ఉన్నారు. తాజాగా మహా కుంభమేళాకు వారి కుటుంబం వెళ్లగా.. గంగాసాగర్ పోలికలతో ఉన్న ఓ అఘోర వారి కంట పడ్డాడు. దీంతో అని ఫోటో తీసి వెంటనే ధన్వా దేవికి పంపించగా.. అతడే అని ఆమె కూడా గుర్తించింది. దీంతో తన కుటుంబంతో కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్లింది. నుదిటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై ఉన్న దెబ్బలు చూసి.. ఆ అఘోరా తన భర్త గంగా సాగరే అని ధన్వా దేవి నిర్ధారించుకుంది. దీంతో 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్త దొరికాడని ఎంతో సంతోషించింది.
ఈ క్రమంలోనే తమతో పాటు ఇంటికి రావాలని గంగాసాగర్‌ను కోరగా అతడు నిరాకరించాడు. వారిని చూసిన విచిత్రంగా ప్రవర్తించిన ఆ అఘోరా.. తాను వారణాసికి చెందిన అఘోరాను అని.. తన పేరు బాబా రాజ్ కుమార్ అని చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. మీరు ఎవరు.. మీతో నాకు ఎటువంటి సంబంధం లేదని గంగాసాగర్ చెప్పడంతో వారికి గుండెల్లో రాయి వేసినంత పని అయింది. చివరికి వారంతా పోలీసులను ఆశ్రయించి విషయం మొత్తం చెప్పారు. తాము కుంభమేళా ముగిసే వరకు ఇక్కడే ఉంటామని.. అవసరమైతే తన భర్తకు డీఎన్ఏ టెస్ట్‌లు చేయించాలని ధన్వాదేవి కోరారు. డీఎన్ఏ పరీక్షలో ఆ అఘోరా గంగాసాగర్ కాదని తేలితే ఆయనకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతామని పేర్కొన్నారు.