ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాకిచ్చిన జియో.. ఆ రెండు పాపులర్ ప్లాన్స్ తొలగింపు

business |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 11:18 PM

మొన్నటివరకు మొబైల్ సిమ్ రీఛార్జులకు సంబంధించి రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి వాటిల్లో పలు ఇబ్బందులు ఉండేవి. చాలా వరకు డేటాతో లింక్ అయి ఉన్న ప్లాన్స్ ఉండేవి. ఈ క్రమంలో వాయిస్ ఓన్లీ ప్లాన్స్ చేసుకోవాలంటే కూడా డేటాతో సహా ఉన్న ప్లాన్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులతో రీఛార్జ్ ప్లాన్స్ ఉండేవి కావు. ఈ టెలికాం దిగ్గజాల్లో ఒకటో, రెండో ప్లాన్స్ కాస్త బెటర్ ధరల్లో స్వల్ప డేటాతో ఎక్కువ వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ఫీచర్లతో ఉండేవి. ఎక్కువ డేటా అవసరం లేదనుకున్న వారు ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునేవారు. జియోలో ఇలాంటివి ఇంతకుముందు రూ. 189, రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉండేవి.


అయితే వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలతో అస్సలు డేటా లేకుండా వాయిస్ ఓన్లీ, ఎస్ఎంఎస్ సర్వీసులు ఆఫర్ చేస్తూ రెండు చొప్పున ప్లాన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు స్వల్ప డేటాతో వాయిస్ కాల్స్ ఆఫర్ చేసే ప్లాన్స్‌ను సైలెంట్‌గా ఎత్తేసింది రిలయన్స్ జియో. అందుబాటు ధరల్లో ఇప్పుడు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి. వాటిల్లో డేటా ఉండదు.


తక్కువ డేటా, ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్స్ కావాలనుకునే వారి కోసం జియో గతంలో రూ. 189 ప్లాన్ తీసుకొచ్చింది. ఇక్కడ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సహా రోజుకు 100 ఎస్ఎంఎస్ లు వచ్చేవి. ఇంకా మొత్తం 28 రోజుల వ్యాలిడిటీకి 2జీబీ డేటా వచ్చేది. ఇక 84 రోజుల వ్యాలిడిటీతో రూ. 479 ప్లాన్ ఉండేది. ఇక్కడ కూడా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్ లు ఉండేవి. డేటా మాత్రం ఇక్కడ 6జీబీ వచ్చేది. దీంతో తక్కువ డేటా కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్లుగా నిలిచాయి. ఇప్పుడు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తీసుకొచ్చి.. పాత ప్లాన్స్‌ను వెబ్‌సైట్స్, యాప్స్ నుంచి తొలగించింది.


వాయిస్ ఓన్లీ ప్లాన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం జియోలో 84 రోజుల వ్యాలిడిటీతో రూ. 458 ప్లాన్, 365 రోజుల వ్యాలిడిటీతో రూ. 1958 ప్లాన్ తొలుత తీసుకొచ్చింది. వీటిపై జియో సినిమా, జియో టీవీ, క్లౌడ్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ధరలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని ట్రాయ్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. దీనిని వరుసగా రూ. 448; రూ. 1748కి తగ్గించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com