చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ.. తమ సంస్థలోని ఉద్యోగులకు వార్షిక బోనస్ కింద 11 మిలియన్లు (అంటే మన కరెన్సీలో రూ.70 కోట్లు) ప్రకటించింది. ఆ డబ్బులను నేరుగా వారి చేతికి ఇవ్వడం లేదా బ్యాంకు ఖాతాల్లో జమచేయలేదు. ఆఫీసులోని 60 నుంచి 70 మీటర్ల పొడవున్న టేబుల్‌పై ఈ మొత్తాన్ని ఉంచింది. ఉద్యోగులను 30 బృందాలుగా విడదీసి.. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే రావాలని సూచించింది. వచ్చినవారు 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో అంత ఈ టీమ్ తీసుకోవచ్చని సూచించింది.
దీంతో ఉద్యోగులు తమకు ఇచ్చిన సమయంలో వీలైనంత ఎక్కువ డబ్బు లెక్కించడానికి ప్రయత్నించారు. ఓ ఉద్యోగి 15 నిమిషాల్లో 100,000 యూన్లు (రూ.11.5 లక్షలు) లెక్కించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సంస్థను పొగుడుతుంటే.. ఇంకొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.
‘తమ కంపెనీలోనూ ఇలాగే జరిగిందని, అయితే, అక్కడ డబ్బులకు బదులు టన్నుల కొద్దీ పనిభారం ఇస్తున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.... ‘నాకు కావాల్సింది ఇదే కానీ కంపెనీకి వేరే ప్రణాళికలు ఉన్నాయి’ అని మరో నెటిజన్ జోక్ చేశాడు. అయితే, ఇలా పోటీపెట్టి గడువులోగా ఎంత లెక్కిస్తే అంత తీసుకోమని చెప్పడం కంటే నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేయాల్సిందని కొందరు.. ఇది వారిని అనుమానించడమేనని మరి కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, హెనన్ క్రేన్ సంస్థ తన ఉద్యోగులకు ఇలా బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2023 జనవరిలోనూ ఇదే విధంగా తమ ఉద్యోగులకు రూ.70 కోట్ల బోనస్ ఇచ్చింది. అప్పుడు కూడా ఇదే మాదిరిగా ఆ సొమ్మును వారికి పంపిణీ చేయడం గమనార్హం.