యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 28, 29 తేదీల్లో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగ్గా.. ఆ నిర్ణయాల్ని బుధవారం రోజు వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ నిర్ణయం వెలువడింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఇదే తొలి ఫెడ్ కమిటీ సమావేశం కావడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా వడ్డీ రేట్లు 4.25 శాతం నుంచి 4.50 శాతం రేంజ్‌లో ఉన్నాయి. దీనికి ముందు చూస్తే వరుసగా మూడు సమావేశాల్లోనూ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా తగ్గిస్తారనుకుంటే అలా జరగలేదు.
2020 తర్వాత తొలిసారిగా ఫెడ్ వడ్డీ రేట్లను దాదాపు నాలుగేళ్ల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 4.75-5.0 శాతానికి చేర్చింది. అంతకుముందు ఇది 5.25- 5.50 శాతం రేంజ్‌లో ఉండేది. 22 ఏళ్ల గరిష్ట స్థాయి నుంచి ఒక్కసారిగా తగ్గించింది. ఆ తర్వాత కూడా మళ్లీ రెండు వరుస సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది ఫెడ్. 2025లోనూ వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని గతంలో ప్రకటించిన ఫెడ్.. ఈసారి యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ మార్కెట్ పరిస్థితులు బలంగా ఉన్నాయని.. ద్రవ్యోల్బణమే లక్ష్యం కంటే కాస్త ఎక్కువగా ఉందని తెలిపింది ఫెడ్.
అయితే ఫెడ్ ప్రకటన తర్వాత స్పందించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ .. ఫెడ్ వైఖరి సహా ఛైర్మన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఫెడ్ సరైన వైఖరి అవలంబించట్లేదని ఆరోపించారు. ద్రవ్యోల్బణంతో వారు సృష్టించిన సమస్యను పరిష్కరించడంలో ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్, ఫెడ్ విఫలం అవుతూ వస్తుందని, అనవసర విషయాలపై దృష్టి సారిస్తోందని అన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఎప్పటినుంచో ట్రంప్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ అలా జరగలేదు. విశేషం ఏంటంటే.. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో వడ్డీ రేట్లు సున్నా స్థాయిలో ఉండేవి. ఆ తర్వాత క్రమంగా పెరుగుకుంటూ గరిష్ట స్థాయిలకు చేరాయి.
>> ఇక సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. డాలర్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి.. బంగారం ధరలు పెరుగుతుంటాయి. వైస్ వర్సా ఇలాగే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ పెరిగి గోల్డ్ రేట్లు తగ్గుతుంటాయి. ఇటీవల ఫెడ్ వరుసగా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినా.. అంటే పెంచకున్నా.. గోల్డ్ రేట్లు పెరుగుతుండటం గమనార్హం.
ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2778 డాలర్లకు పెరిగింది. కిందటి రోజుతో పోలిస్తే దాదాపు 20 డాలర్ల వరకు పెరగడం గమనార్హం. ఇక స్పాట్ సిల్వర్ రేటు 31.06 డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణం లక్షిత పరిధికిపైనే ఉన్నందున ఇలా జరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 76,100 వద్ద ఉండగా.. 24 క్యారెట్స్ పసిడి ధర తులం రూ. 83,020 కి చేరింది.