ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదానీ కంపెనీకి బిగ్ షాక్.... ఒక్కసారిగా పడిపోయిన స్టాక్

business |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 11:37 PM

దేశంలోని రెండో అత్యంత ధనవంతుడు, దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి భారీ షాక్ తగిలింది. ఆయన అదానీ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయినటువంటి అదానీ ఎంటర్‌ప్రైజెస్.. 2024-25 ఆర్థిక సంవత్సరం అక్టోబర్- డిసెంబర్ సమయానికి సంబంధించి ఫలితాల్ని వెల్లడించింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ. 228.64 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే లాభం ఏకంగా 88 శాతం పతనమైంది. ఆ సమయంలో కంపెనీ నికర లాభం రూ. 1972.75 కోట్లుగా ఉండేది. కిందటి త్రైమాసికం అంటే జులై- సెప్టెంబర్ సమయంలో లాభం రూ. 1989 కోట్లుగా ఉండగా.. ఇక్కడి నుంచి చూస్తే 88.5 శాతం లాభం పడిపోయింది.


ఇక యజమానులకు ఆపాదించబడిన కంపెనీ ప్రాఫిట్ మరీ దారుణంగా పతనమైంది. 2024, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇది రూ. 58 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఏకంగా రూ. 1888 కోట్లుగా ఉండగా.. 97 శాతం పడిపోవడం గమనార్హం.


సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా పడిపోయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2023-24 అక్టోబర్- డిసెంబర్ సమయంలో రూ. 25,540 కోట్లుగా ఉండగా ఇప్పుడు అది రూ. 23,500 కోట్లకు పడిపోయింది. ఇక ఇది త్రైమాసిక ప్రాతిపదికన చూసినట్లయితే దాదాపు ఫ్లాట్‌గా ఉంది. అంతకుముందు రూ. 23,196 కోట్ల ఆదాయం ఉంది. కంపెనీ ఎబిటా చూస్తే ఏడాది ప్రాతిపదికన 5 శాతం తగ్గి రూ. 3071 కోట్లుగా నమోదైంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ. 3,227 కోట్లుగా ఉండేది.


ఇతర ఆదాయాల విషయానికి వస్తే మూడో త్రైమాసికంలో ఇది 33 శాతం పెరిగి రూ. 652 కోట్లుగా ఉంది. అంతకుముందు ఇదే సమయంలో రూ. 490 కోట్లుగానే ఉంది. మొత్తం వ్యయాలు ఒక శాతం తగ్గి రూ. 22,925 కోట్లకు దిగొచ్చాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల సమయంలో ఆదాయం 6 శాతం పుంజుకొని రూ. 72,763 కోట్లుగా వచ్చింది. టాక్స్ తీసేస్తే ప్రాఫిట్ 17 శాతం పెరిగి రూ. 3,254 కోట్లుగా ఉంది. ఇక బలహీన ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు గురువారం రోజు చివరకు 3.05 శాతం నష్టంతో రూ. 2247.90 వద్ద సెషన్ ముగించింది. ఆరంభంలో లాభాల్లో ట్రేడయినప్పటికీ.. ఫలితాల తర్వాత ఒక్కసారిగా స్టాక్ పడిపోయింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.60 లక్షల కోట్లకు దిగొచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com