ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెలికాప్టర్ పైకో, కిందకో ఎందుకు వెళ్లలేదు..: ట్రంప్ తీవ్ర అసహనం

international |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 10:55 PM

అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం రోజు అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని వాషింగ్టన్ విమానాశ్రయం వద్ద ప్రయాణికులతో వస్తున్న ఓ విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఒక దానినొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. రెండూ కింద ఉన్న నదిలో కూలిపోయాయి. ఇందుకు సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా.. తాజాగా దీనిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. విమానం ఎదురుగా వెళ్తున్న హెలికాప్టర్ కిందకో, పైకో ఎందుకు వెళ్లలేదంటూ కంట్రోల్ రూమ్ సిబ్బందిని ప్రశ్నించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


పీఎస్ఏ ఎయిర్ లైన్స్‌కు చెందిన బొంబార్డియన్ సీఆర్జే700 విమానం కన్సాస్ నుంచి వాషింగ్టన్‌లోని రీగన్ విమానాశ్రయానికి వస్తోంది. అదే సమయంలో స్కిరోస్కీ హెచ్-60 హెలికాప్టర్‌ వర్జీనియాలోని ఫోర్ట్ బెల్వోయిన్‌లో ఉంది. అప్పుడు శిక్షణా మిషన్ నడుస్తుండగా.. గాల్లోనే తిరుగుతోంది. అయితే పౌర విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వగా సరిగ్గా అదే సమయానికి మిలటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్‌కు సమాచారం ఇచ్చారు.


ఈక్రమంలోనే పక్కకో, కిందకో జరగమని చెప్పకుండా.. మీ ముందు విమానం వస్తోంది కదా కనిపిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్, విమానం ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. దీంతో భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి ఆపై కింద ఉన్న పొటామాక్ నదిలో కూలిపోయాయి. అయితే అటు విమానం, ఇటు హెలికాప్టర్ లో కలిపి మొత్తంగా 67 మంది ఉండగా.. ఇప్పటి వరకు నది నుంచి 18 మృతదేహాలను బయటకు తీశారు. ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ప్రాణాలతో బయట పడలేదు.


అయితే తాజాగా ఈ ఘటనపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విమానాశ్రయానికి వెళ్లే దారిలో విమానం సరైన దిశలో ఉందని.. కానీ హెలికాప్టర్ చాలా సేపు నేరుగా విమానం వైపు వెళ్లిందని వివరించారు. ఆ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉందని, విమానం లైట్లు కూడా అన్నీ వెలుగుతున్నాయని తెలిపారు. అలాంటి సమయంలో హెలికాప్టర్ కిందకో, మీదకో పక్కకు ఎందుకు వెళ్లలేదని ట్రంప్ ప్రశ్నించారు. విమానాన్ని చూశారా అని కంట్రోల్ రూం సిబ్బంది అడిగే బదులుపు ఏం చేయాలో చెప్పలేదని.. ఇది పూర్తిగా నివారించదగ్గ ప్రమాదం అని వెల్లడించారు. ఇలా జరగడం ఏమాత్రం సరిగ్గా లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


అంతకు ముందు చేసిన మరో పోస్టులో.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై ముందు స్పందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తాను అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని.. త్వరలోనే అధికారులు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com