ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతా 30 సెకన్లలోనే.. అమెరికా విమాన ప్రమాదం

international |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 10:47 PM

అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది..ఆ దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో అధ్యక్ష భవనానికి 5 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ సమీపంలో ప్రయాణికుల విమానం, హెలికాప్టర్‌ ఒకదాననొకటి ఢీకొట్టి నదిలో కూలిపోయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హెలికాప్టర్, ప్రయాణికుల విమానం ఢీకొట్టిన తర్వాత భారీ శబ్దంతో మంటలు చెలరేగడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రమాద కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, కేవలం 30 సెకన్లలోనే ఘోరం జరిగిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.


కన్సాన్‌ నుంచి ప్రయాణికులతో వస్తోన్న పీఎస్ఏ విమానం ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు పైలట్‌ను రోనాల్డ్ రీగన్ విమానాశ్రయంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ సిబ్బంది సంప్రదించారు. కొత్తగా నిర్మించిన రన్‌వే 33పై ల్యాండ్‌ చేయగలరా? అని అడిగారు. అందుకు పైలట్లు సమ్మతి తెలపడంతో కొత్త రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ క్లియరెన్స్‌ ఇచ్చింది.


సరిగ్గా అదే సమయంలో స్కిరోస్కీ హెచ్-60 ఆర్మీ హెలికాప్టర్‌ ఆ మార్గంలోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఏటీసీ అధికారి.. హెలికాప్టర్‌ పైలట్‌కు సమాచారం ఇచ్చారు. ‘మీ ముందు ఓ విమానం వస్తోంది కన్పిస్తుందా?’ అని అడిగి.. కొన్ని క్షణాల్లోనే మరో రేడియో సందేశం పంపించారు. ఆ తర్వాత కేవలం 30 సెకన్లలోపే దుర్ఘటన జరిగిపోయింది. ఆ రెండూ ఢీకొన్నట్లు భారీ శబ్దం వినిపించింది. రన్‌వేకు 2400 అడుగుల దూరంలో విమానం నుంచి రేడియో ట్రాన్స్‌పాండర్‌ డేటా నిలిచిపోయింది. విమానం సరిగ్గా నది మధ్యలో ఉన్నప్పుడే సిగ్నల్స్‌ ఆగిపోయినట్టు గుర్తించారు. రెండూ ఢీకొట్టిన తర్వాత విమానం రెండు ముక్కలైపోగా... హెలికాప్టర్‌ కూడా తలకిందులుగా కూలింది.


మరోవైపు, విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన... సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. విమానానికి ఎదురుగా వెళ్తోన్న విమానం కిందకు లేదా పైకి ఎందుకు వెళ్లలేదని ఆయన ఏటీసీని ప్రశ్నించారు. ప్రమాదం చోటుచేసుకున్న గగనతలం ప్రపంచంలోనే అత్యంత భద్రత, నిరంతరం పర్యవేక్షణ ఉండే అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌, క్యాపిటల్‌కు దక్షిణాన కేవలం 5 కి.మీ. దూరంలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com