ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలా చేస్తే 8 నెలల జీతం ఇస్తా,,,ఉద్యోగులకు ట్రంప్ ఆఫర్

international |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 10:53 PM

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అలాగే తమ మాట వినని దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ దారికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గించేందుకు.. ఉద్యోగుల సంఖ్యను కుదించే దిశగా ట్రంప్‌ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 6 లోగా స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యే వారికి 8 నెలల జీతం ముందుగానే ఇస్తామని ప్రతిపాదించింది. ఈ మేరకు 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మెయిల్‌ పంపింది.


ఉద్యోగం మానేయడం ఇష్టమైతే మెయిల్కు ‘ఎస్’ అని సమాధానం ఇవ్వాలని అందులో సూచించారు. ఇమ్మిగ్రేషన్, నేషనల్ సెక్యూరిటీ సంబంధిత, యూఎస్ పోస్టల్ సర్వీస్ ఎంప్లాయిస్ను ఇందులో నుంచి మినహాయించారు. మరోవైపు కొవిడ్‌ కాలం నుంచీ ఆఫీసుకు రాకుండా ఆన్‌లైన్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఫెడరల్‌ ఉద్యోగులకు ట్రంప్‌ ప్రభుత్వం మరో తాఖీదు ఇచ్చింది. ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాలని.. అలా చేయకుంటే ఉద్యోగం ఉండదని ఈ- మెయిల్ పంపింది. ఈ నేపథ్యంలో దాదాపు 5 నుంచి 10 శాతం ఉద్యోగులు బైఅవుట్స్ ఆఫర్‌ని ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విధానంతో అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్‌‌ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు.


అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వంలో ప్రస్తుతం సుమారు 30 లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశంలోని మొత్తం ఉద్యోగాల్లో ఇది 1.9 శాతం అని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కొద్ది శాతం మంది ఉద్యోగులు కొలువును వదులుకున్నా అది పెను సంచలనమే కానుంది. దీనివల్ల హఠాత్తుగా ఏర్పడే సిబ్బంది కొరతతో ఫెడరల్‌ ప్రభుత్వ సేవలపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు.


మరోవైపు ఫెడరల్‌ గ్రాంట్లపై ఆధారపడే అనేక శాఖల నిధులను నిలిపివేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అవి అమలైతే పోలీసు శాఖకు, గృహ హింస రక్షణ శిబిరాలకు, పోషకాహార సేవల శాఖకు చెల్లించాల్సిన ట్రిలియన్ల డాలర్ల నిధులు నిలిచిపోయే పరిస్థితి నెలకొనేది. అయితే ఆయన ఆదేశాలను ఒక ఫెడరల్‌ కోర్టు నిలువరించడంతో ఆ పరిస్థితి తప్పింది.


పార్లమెంటు అనుమతించిన ఖర్చులకు కేటాయించిన నిధుల్ని నిలిపే అధికారం దేశాధ్యక్షునికి లేదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ట్రంప్‌ చర్యలు దేశాధ్యక్షుడి అధికారాలకు, కాంగ్రెస్‌ ప్రత్యేక అధికారాలకు మధ్య ఉన్న స్పష్టమైన విభజన రేఖను చెరిపేసేందుకు ఉద్దేశించినట్టున్నాయని నిపుణులు అంటున్నారు. ఆయన చేపడుతున్న చర్యలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com