ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫార్ములా- ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 06, 2024, 04:14 PM

ఫార్ములా ఈ కార్ రేసింగ్  వ్యవహారంలో ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టింది.ఆర్‌ఈ (రెగ్యులర్ ఎంక్వయిరీ)ని మొదలుపెట్టింది ఏసీబీ. ఆర్‌ఈలో ఫైళ్లు పరిశీలించి, అక్రమాలు ఎలా జరిగాయి అనేదానిపై ఏసీబీ విచారణ జరుపనుంది. రెండు రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఫార్ములా-ఈ రేసింగ్ సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది. మునిసిపల్ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆయా విదేశీ సంస్థలు, ప్రతినిధులకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. రేస్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.కాగా.. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ రేస్‌లో రూ.55 కోట్లు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన మున్సిపల్‌ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఐఏఎస్‌లు సహా అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారు పెద్దల ప్రమేయం ఉండడంతో కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత వచ్చే వారం నుంచి కేసుతో సంబంధం ఉన్నవారందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చి, విచారించి స్టేట్‌మెంట్లు రికార్డు చేయనున్నారు. ఐఏఎస్‌లు మొదలు కీలక అధికారులు, నాటి ప్రజాప్రతినిధుల దాక వీరిలో ఉండే అవకాశం ఉంది. స్టేట్‌మెంట్‌ ఆధారంగా గత ప్రభుత్వంలోని కీలక నేతలకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి అప్పటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆదేశిస్తేనే విదేశీ సంస్థలకు నిధులు విడుదల చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు.


 


 


2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న రెండోసారి (సెషన్‌-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్‌(ఎఫ్‌ఈవో)తో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌-అర్బన్‌ డెవల్‌పమెంట్‌(ఎంఏయూడీ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఎంఏయూడీ రూ.55 కోట్లు చెల్లించింది. అయితే, ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం మారిన వెంటనే ఒప్పందంలోని అంశాలను పాటించకపోవడంతో తాము ఫార్ములా ఈ ఆపరేషన్‌ నిర్వహించడం లేదని విదేశీ సంస్థలు ప్రకటించాయి. దీంతో సెషన్ - 10 రద్దయ్యింది. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఆర్థిక శాఖ, ఇతర విభాగాల నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు చెల్లించినట్లుగా తేల్చింది. ఈ రేసింగ్‌లో జరిగిన అక్రమాలపై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. దీనిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa