దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావో అత్యాచారం బాధితురాలు, ఆమె తల్లిని పారామిలటరీ బలగాలు ఈడ్చిపడేశాయి. ఈ కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబం మీడియా సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించగా.. జవాన్లు అడ్డుకున్నారు. అనంతరం బాధితురాలి తల్లిని ఎత్తుకెళ్లి బస్సులో పడేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. సెంగార్ అప్పీలు పెండింగ్‌లో ఉన్నంత వరకు అతడి శిక్షను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు.. కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ తీర్పుపై బాధితురాలు, ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగలేదని, తమను చంపాలని చూస్తున్నారని బాధితురాలి తల్లి ఆరోపించారు. గత రాత్రి, బాధితురాలు, ఆమె తల్లి, వారి లాయర్ యోగితా భయానా ఇండియా గేట్ వద్ద నిరసన తెలపడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ బుధవారం ఉదయం మండి హౌస్‌లో మీడియాను కలవాలని భావించారు. కానీ, వారు ప్రయాణిస్తున్న బస్సుకు ఎస్కార్ట్‌గా ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు కిందకు దిగనీయలేదు. మండి హౌస్‌లో గానీ, ఇండియా గేట్ వద్ద గానీ నిరసన తెలిపేందుకు అనుమతి లేదని తెలిపారు. వారిని జంతర్ మంతర్ లేదా వారి ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు.
అనంతరం, కదులుతున్న బస్సు డోర్ వద్దకు వచ్చిన బాధితురాలి తల్లి తోసేసి, లోపలి నుంచి దూకమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా బస్సులో మహిళా జవాన్లు ఎవరూ లేరు. జవాన్లు ఆమెను బలవంతంగా తోసివేయడంతో బాధితురాలి తల్లి కదులుతున్న బస్సులోంచి దూకింది. ఆ తర్వాత బస్సు, అందులో ఉన్న బాధితురాలు, అక్కడి నుంచి వెళ్లిపోయింది.
‘‘మాకు న్యాయం జరగలేదు.. నా కూతుర్ని బంధించారు. వాళ్లు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు నా కూతుర్ని తీసుకెళ్లి, నన్ను రోడ్డు మీద వదిలేశారు. మేం ప్రాణాలు వదిలేస్తాం. నిరసన తెలపడానికి వెళ్తుంటే బలవంతంగా నా కూతుర్ని తీసుకెళ్లారు. మేం మండి హౌస్‌లో నిరసన తెలపడానికి వెళ్తున్నాం’ అని బాధితురాలి తల్లి మీడియాకు తెలిపారు.
జూన్ 2017లో ఉన్నావో బాధితురాలి అత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ పేరు బయటకు వచ్చింది. అతడ్ని పార్టీ నుంచి బహిష్కరించారు. 2019లో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడినందుకు దోషిగా నిర్ధారించారు. బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో కూడా అతడ్ని దోషిగా తేల్చారు.
తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తినప్పటి నుంచి జీవితం తలకిందులైన బాధితురాలు వాపోయింది. మన న్యాయవ్యవస్థ మాకు ఇలా ఎలా చేయగలదని ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెంగార్‌కు ఉపశమనం లభించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని ఆమె తెలిపారు. ‘అత్యవసర విచారణ జరగాలి. నిందితుడికి డబ్బు, అధికారం ఉన్నాయి. అందుకే అతను తన దారి చూసుకున్నాడు. మేం బాధపడాలి’" అని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa