నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ఇవాళ రాత్రి లేదా సోమవారం ఉదయం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రానున్న 2 రోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఈ ఆవర్తనం కొనసాతుందని పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అన్నారు. తెలంగాణలో నేటి నుంచి రెండ్రోజులు ఉపరితల ఆవర్తనం ప్రభావం అంతగా ఉండదన్నారు. నవంబర్ 11, 12 తేదీలలో రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని చెప్పారు. నవంబర్ 13న రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో భిన్న వాతావరణం ఉంటుందని చెప్పారు. ఉదయం వేళల్లో చల్లగా.. మధ్యాహ్నం ఎండ కాసినా.. సాయంత్రానికి మేఘావృతమై ఉంటుందన్నారు. ఉదయం వేళ పొగ మంచు కమ్ముకునే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తూర్పు, ఈశాన్య దిశలో గంటల 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల మేర నమోదు అవుతున్నట్లు వెల్లడించారు.
ఇక అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రెండ్రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మిగతా చోట్ల తేలికపాటి జల్లులకు ఛాన్స్ ఉందన్నారు. వర్షం హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకపోవటం మంచిదని చెప్పారు. తీరం వెంట బలమైన గాలులు వీస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలుఇదిలా ఉండగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో శనివారం అత్యధికంగా 35 డిగ్రీలు, ఖమ్మంలో 34, మెదక్ లో 33.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మెదక్‌లో 15.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 16.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.