తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. మహిళా సంఘాలకు ఐదేళ్ల కాలంలోనే రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏడాదిలో రూ.25వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు వరంగల్ సభలో స్పష్టం చేశారు. ఈ రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. మహిళా సంఘాలతో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయించడం చరిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని మహిళల ఎదుగుదలకు తమ ప్రభుత్వం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తుందని చెప్పారు. అవసరమైతే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. అనేక భావజాలాలకు స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వకుండా మహిళా ఆర్థిక స్వాతంత్య్రాన్ని నిర్లక్ష్యం చేసిందని భట్టి విమర్శించారు. జనాభాలో సగం మంది ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని.. వారిని కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు సోలార్ ప్లాంట్లు, బీమా సౌకర్యం కల్పించడం దేశంలోనే ప్రథమమని చెప్పారు. ధరణిలో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే వాటన్నింటినీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించినట్లు చెప్పారు. వరంగల్‌ను మహానగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపామన్నారు. గత ప్రభుత్వం హయంలో కొంతమంది పెద్దలు పేదల, ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో ప్రతి గజాన్నీ స్వాధీనం చేసుకొని పేదవాళ్లకు ఇస్తామని చెప్పారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌లోనే రైతుల సంక్షేమం కోసం రూ.72 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటా నెరవేరుస్తున్నామని వెల్లడించారు.