చాలా మంది జంతు ప్రేమికులు కుక్కలను పెంచుకుంటారు. వాటి ఆలనా పాలనా దగ్గరుండి చూసుకుంటారు. కొందరు పెట్ లవర్స్.. తమ కుక్కలను మల విసర్జన చేయించేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో వాటిని బయటకు తీసుకెళ్తుంటారు. అలా వీధుల్లో ఓ రెండు, మూడు రౌండ్ల తర్వాత కుక్కలు మల విసర్జన పూర్తి చేస్తాయి. ఇలా చేయటం వల్ల ఆయా పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయని తెలిసినా.. కొందరు యజమానులు అవేవీ పట్టకుండా తమ పెంపుడు కుక్కలను మల విసర్జన కోసం బయటకు తీసుకెళ్తుంటారు.
ఇక నుంచి పెంపుడు కుక్కలు అలా బయట మల విసర్జన చేస్తే వాటి యజమానులు ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు మున్సిపల్ యాక్ట్‌లో ఉన్న నిబంధనను ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లో కఠినంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లకూ సైతం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిబంధన ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే అమలులో ఉంది. చాలా పట్టణాల్లో పరిసరాల అపరిశుభ్రతకు కుక్కల మలవిసర్జన కూడా ఓ కారణంగా అధికారులు గుర్తించారు. వీధి కుక్కల సంగతి పక్కనపెడితే.. పెంపుడు కుక్కల విషయంలోనైనా వాటి యజమానులు జాగ్రత్తగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా మున్సిపల్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. పెంపుడు కుక్క వీధిలో మలవిసర్జన చేస్తే దాని యజమానికి మున్సిపల్ అధికారులు రూ.1000 వరకూ ఫైన్ విధించే అవకాశం ఉంది. ఈ ఫైన్ ఒకే రకంగా కాకుండా ఆయా మున్సిపాలిటీలను బట్టి మారుతుంటుంది. ఎవరైనా తమ పెంపుడు కుక్కలను నిర్లక్ష్యంగా రోడ్ల మీదకు వదిలేస్తే.. అవి అక్కడ మలవిసర్జన చేస్తే.. వాటి యజమానులే తొలగించి ఆ పరిసరాలు శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే వారికి మున్సిపల్ అధికారులు రూ.వెయ్యి వరకూ ఫైన్ విధించే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పెంపుడు కుక్కల యజమానులు జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.