హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ సిద్దిక్ నగర్‌లోని ఓ ఐదంతస్తుల భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. ఈ ఘటన మంగళవారం (నవంబర్ 19) రోజు రాత్రి సమయంలో జరిగింది. గమనించిన చుట్టుపక్కన ఉన్న స్థానికులు.. భవనంలో ఉన్నవారిని అప్రమత్తం చేయటంతో.. అందులో నివసిస్తున్నవారు.. తీవ్ర భయాందోళకు గురై బయటకు పరుగులు తీశారు. చుట్టుపక్కన ఉన్న స్థానికులు కూడా భయంతో టెన్షన్ పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పక్కకు ఒరిగిన భవనాన్ని పరిశీలించారు. పక్కకు ఒరిగిన బిల్డింగ్ పక్కనే.. ఇంకో నిర్మాణం చేపట్టగా.. పెద్ద పెద్ద గుంతలు తీయడంతో బిల్డింగ్ పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది.
అయితే.. ఐదంతస్తుల భవనం ప్రమాదకరంగా పక్కకు ఒరగడంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా భవనంలో నివసిస్తోన్న వారితో పాటు.. బిల్డింగ్ చుట్టుపక్కను ఉన్న వారిని కూడా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకుని ముందస్తు చర్యల్లో పాల్గొన్నారు. హైడ్రా కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
ఐదంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగిందన్న వార్త.. క్షణాల్లోనే నగరమంతా వ్యాప్తి చెండటంతో.. దగ్గర్లో ఉన్న స్థానికులు ఘటన స్థలానికి వెళ్లి మరీ ఆ భవనాన్ని చూస్తున్నారు. కొందరు పక్కకు ఒరిగిన బిల్డింగును వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో.. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే.. అసలు బిల్డింగ్ ఎందుకు పక్కకు ఒరిగింది. నిజంగానే పక్కన నిర్మాణం కోసం గుంతలు తీయటం వల్లే ఈ ప్రమాదం జరిగిందా.. లేదా నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఐదంతస్తుల భవనం నిర్మించినందుకే ఇలా ఒరిగిందా.. లేదా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మించినందుకు ఇలా జరిగిందా.. లేక సరైన పునాది, పిల్లర్లు వేయకపోవటం లాంటిదేమైనా ఉందా, అక్కడి భూమి ఏమైనా కుంగిందా అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది. దీనిపై నెటిజన్లు, స్థానికులు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ చర్చిస్తున్నారు.