హైదరాబాద్ మహానగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న నీటి బిల్లుల బకాయింపుల చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 (ఓటీఎస్) పథకం తుది గడువు సమీపిస్తోంది. మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 30వ తేదీతో బిల్లులు చెల్లించే గడువు పూర్తవుతుంది. ఈ లోపు ఓటీఎస్ ను ఉపయోగించుకున్న వినియోగదారులకు పెండింగ్ లో ఉన్న అసలు మొత్తం కడితే.. ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే, పెండింగ్ బిల్లుల మీద వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అక్టోబర్ లో ప్రారంభమైన ఈ పథకం ఆ నెల చివరి వరకు కొనసాగింది. అయితే పండగలు రావడం, ప్రజలు సొంతూళ్లకు వెళ్లడం, ఆర్థిక భారం పడటంతో పథకాన్ని సరిగా వినియోగించులేకపోయారు. మరోసారి పథకం గడువును పెంచాలని వారి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జలమండలి.. పథకం గడువును పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. మరో నెల అంటే నవంబర్ ఆఖరి వరకు పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది.ప్రజల నుంచి వినతులు రావడంతో ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన ప్రభుత్వం.. ఈ పథకాన్ని మరోసారి పెంచే అవకాశం లేనందున, నిర్ణీత గడువులో సద్వినియోగం చేసుకోవాలని జలమండలి అధికారులు కోరుతున్నారు. పథకం గడువు ముగిసన అనంతరం... పెండింగ్ బిల్లుల వినియోగదారులపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే వారి నల్లా కనెక్షన్ సైతం తొలగించనున్నారు.