స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. వచ్చే సంక్రాంతికి షెడ్యూల్‌ను విడుదల చేసి.. ఫిబ్రవరి రెండో వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోన్నట్టు తెలుస్తోంది. మొత్తం మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను జరిపిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ‘ఇద్దరు పిల్లలకు మించి పిల్లలు’ నిబంధనను ప్రభుత్వం ఇప్పటికే ఎత్తివేసింది. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులకు సంబంధించి వేగవంతం చేసినట్టు సమాచారం.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేపెట్టి.. ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లను పూర్తిచేసి, స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగానే సమగ్ర కులగణన చేపట్టారు. ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తిచేసి.. డిసెంబరు 10నాటికి కమిషన్ నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే బీసీ రిజర్వేషన్లపైఓ నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పరరంగా బీసీ రిజర్వేషన్లను పెంచే అవకాశాలను పరిశీలించనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధనను పాటించాల్సి ఉన్నందున.. ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం ఆలోచిస్తోన్నట్టు సమాచారం.
రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని ఎస్‌ఈసీ గతంలో స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 12,867 గ్రామ పంచాయతీలు, 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది జూలై 2తో జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసింది. పంచాయతీల పరిధిలో సర్పంచ్ ఎన్నికల తర్వాతే.. ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్టు సమాచారం.
కొన్ని కొత్త మండలాల్లో ముగ్గురు ఎంపీటీసీలతోనే ఎంపీపీ ఏర్పాటు చేయాల్సి వస్తోంది. నిబంధన ప్రకారం కనీసం ఐదుగురు సభ్యులతో ఎంపీపీ ఉండేలా ఆయా మండలాల్లో ఎంపీటీసీల సంఖ్య పెంచాల్సి ఉంది. దీనిపై అసెంబ్లీలో చర్చించి ఒక చట్టం తెచ్చేవిధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారుల నియామకానికి రాష్ట్రఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకాలను చేపట్టాల్సి ఉంది.