ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.30 లక్షలు కాజేసే ప్రయత్నం.. సైబర్ కేటుగాళ్లను చాకచక్యంగా అడ్డుకున్న ఎస్బీఐ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 07:39 PM

పలు రకాల ఆఫర్లు, కస్టమ్స్ కేసుల పేరుతో సామాన్యులను సైబర్ కేటుగాళ్లు బురిడీకొట్టించి లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి వలకు చిక్కి లక్షలు పోగట్టుకుంటున్న ఘటనలు తరుచూ చూస్తేనే ఉన్నాం. తాజాగా, ఓ వ్యక్తిని బోల్తాకొట్టించడానికి సైబర్ నేరగాళ్లు చేసిన ప్రయత్నాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధికారులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌‌లోని లోతుకుంట బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ 78 ఏళ్ల డాక్టర్ లోతుకుంట బ్రాంచ్‌ను సందర్శించి.. తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మూసివేయాలని మేనేజర్‌ను కలిసి అభ్యర్థించాడు.


అందులోని రూ. 30 లక్షలను ఓ ఖాతాకు బదిలీ చేయాలని కోరాడు. అయితే, అతడి మొబైల్‌‌కు పదే పదే ఫోన్స్ చేసిన కేటుగాళ్లు.. త్వరగా నగదు బదిలీ చేయాలని చెప్పడాన్ని మేనేజర్ గమనించారు. ఈ మొత్తం ఎందుకని మేనేజర్ ప్రశ్నించగా.. అనారోగ్యంతో తన భార్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, అందుకు డబ్బులు అవసరమని ఆ కస్టమర్ చెప్పాడు. ఎస్బీఐ మేనేజర్‌కు అనుమానం వచ్చి.. ఆసుపత్రి పేరు, పేషెంట్ వివరాలు ఆరా తీశాడు. చివరకు ఆ వివరాలతో పేషెంట్ ఎవరూ లేరని నిర్దారణ అయ్యింది.


వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ పెద్దాయన అసలు విషయం బయటపెట్టాడు. ఢిల్లీ నుంచి కస్టమ్స్ అధికారి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తనకు మలేషియా నుంచి 16 పాస్‌పోర్ట్‌లు, ఏటీఎం కార్డులతో కూడిన పార్శిల్ వచ్చిందని చెప్పాడు. తాను ఆధార్ కార్డుల ఆధారంగా 30 బ్యాంకు ఖాతాలు తెరిచి రూ. 88 కోట్ల మనీలాండరింగ్ మోసానికి పాల్పడ్డినట్టు బెదిరించి.. ఆ కేసు నుంచి బయటపడాలంటే తమ ఖాతాకు డబ్బులను బదిలీ చేయాలని డిమాండ్ చేసినట్టు వెల్లడించాడు. దీంతో అది నిజం కాదని ఆ సీనియర్ సిటిజన్‌కు బ్యాంకు అధికారులు సర్ది చెప్పి పంపించారు.


బ్రాంచ్ అధికారులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి సీనియర్ సిటిజన్ డబ్బు సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడరని ఎస్బీఐ పేర్కొంది. దీంతోపాటు డిజిటల్ మోసాలు/ అరెస్టుల గురించి గుర్తుతెలియని కాల్స్ వస్తే 1930 లేదా ప్రభుత్వ పోర్టల్ www.cybercrime.gov.inకి ఫిర్యాదు చేయాలని కస్టమర్లకు సూచించింది. అయితే, గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నెలలో ఓ ఉద్యోగికి డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. దాదాపు రూ.13 లక్షలు లూటీ చేశారు. అలాగే, ఓ మహిళను కూడా బురిడీ కొట్టించి ఏకంగా 37 లక్షలు కొట్టేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com