ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెట్టబోయే వార్షిక బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు పన్ను భారం తగ్గించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పిస్తూ మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు ఉండనున్నాయని పేర్కొంది. ఇందులో భాగంగా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం గల వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ భారాన్ని తగ్గించాలని చూస్తున్నట్లు కేంద్రంలోని ఇద్దరు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. అయితే, ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరీశీలన దశలోనే ఉన్నట్లు తెలిపింది.
రూ. 3 లక్షల నుంచి రూ. 15 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం 5- 20 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్లు వర్తిస్తున్నాయి. ఒక వేళ ఈ పన్ను రేట్లను మరింత తగ్గిస్తే లక్షలాది మందికి భారం తగ్గనుంది. అయితే రూ.15 లక్షల వరకు పన్ను రేట్లలో ఎంత తగ్గిస్తారనే విషయంపై స్పష్టత లేదని రాయిటర్స్ పేర్కొంది. యూనియన్ బడ్జెట్ ప్రకటనలోనే ఈ అంశంపై పూర్తి క్లారిటీ రావచ్చని తెలిపింది. ఇక రూ.15 లక్షలు ఆపైన ఆదాయం గల ఉన్నత వర్గాలపై పన్ను 30 శాతంగా ఉంది. అది అలాగే కొనసాగించవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుత దేశ ఆర్థిక వృద్ధి మందగమనంలో పయనిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వినియోగం తగ్గిపోయి ఆందోళన కలిగించే స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పన్నుల భారాన్ని తగ్గిస్తే ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బులు చేరి వినియోగానికి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పన్ను భారం తగ్గితే మధ్య తరగతి ప్రజల వినియోగం పెరగవచ్చని అంచనా. అయితే పన్ను రేట్ల తగ్గింపు అంశంపై ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీతో సమావేశమైన ఆర్థిక వేత్తలు సైతం పన్ను రేట్లు తగ్గించాలని కోరినట్లు సమాచారం. పన్ను మినహాయింపులు సైతం మరింత ఎక్కువగా కల్పించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో బడ్జెట్ వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం మన దేశంలో రెండు పన్ను విధానాలు ఉన్నాయి. పాత పన్ను విధానంలో వివిధ పెట్టుబడులు, ఖర్చులపై మినహాయింపులు పొందవచ్చు. ఇక 2020లో తెచ్చిన కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి పెట్టుబడులపై మినహాయింలు కల్పించలేదు. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలోనూ పన్ను మినహాయింపులు ఇవ్వాలని ట్యాక్స్ పేయర్లు కోరుతున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్ వినిపిస్తోంది.
పాత పన్ను విధానంలో పన్ను రేట్లు..
రూ. 2,50,000 వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు. రూ. 2.5- 5 లక్షల వరకు 5 శాతం, రూ. 5- 10 లక్షల వరకు 20 శాతం, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. అయితే పాత పన్ను విధానంలో వివిధ పెట్టుబడులు, ఇన్సూరెన్స్ వంటివాటిపై మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు
రూ. 3 లక్షల వరకు పన్ను ఉండదు. రూ. 3- 7 లక్షల వరకు 5 శాతం పన్ను పడుతుంది. రూ. 7- 10 లక్షల వరకు 10 శాతం, రూ. 10- 12 లక్షల వరకు 15 శాతం, రూ. 12- 15 లక్షల వరకు 20 శాతం, రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లయితే 30 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యతరగతి వారు ఈ విధానాన్నే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇందులోనూ ట్యాక్స్ మినహాయింపులు కల్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.