దిగ్గజ వ్యాపారవేత్త, జపాన్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకీ (94) కన్ను మూశారు. లింఫోమా అనే బ్లాడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ డిసెంబర్ 25వ తేదీన తుది శ్వాస విడిచినట్లు సుజుకీ మోటార్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. జపాన్‌కే పరిమితమైన సుజుకీ కంపెనీని ప్రపంచ వ్యాప్తం చేయడంలో ఒసామూ సుజుకీ కీలక భూమిక పోషించారు. భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా వెలుగొందుతున్న మారుతీ సుజుకీ ఏర్పాటుకు ఆద్యుడు ఆయనే. దశాబ్దాల పాటు సుజుకీ సంస్థకు ఛైర్మన్‌గా సేవలందించారు.
జపాన్‌లోని గెరోలో 1930, జనవరి 30వ తేదీన ఒసాము జన్మించారు. ఆయన అసలు పేరు ఒసాము మత్సుడా. స్థానిక బ్యాంకులో రుణ వితరణ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన 1958లో షోహో సుజుకీని పెళ్లి చేసుకున్నారు. సుజుకీ కుటుంబానికి వారసులు లేకపోవడంతో వారి వివాహం తర్వాత ఆయన పేరు చివరన సుజుకీ చేరింది. ఆ తర్వాత సుజుకీ కంపెనీ పగ్గాలు చేపట్టారు. కార్లు, ద్విచక్రవాహనాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో ఒసాము కీలక పాత్ర పోషించారు.
ఒసాము హయాంలోనే జనరల్ మోటార్, ఫోక్స వ్యాగన్ వంటి దిగ్గజ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నారు. ఇలా ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో సుజుకీని విస్తరించారు. 1980లో భారత్‌లోకి ఇదే తరహాలో సుజుకీ కంపెనీని తీసుకొచ్చారు. మారుతీ ఉద్యోగ్ పేరుతో భారత ప్రభుత్వంతో కలిసి ఆటో మొబైల్ జాయింట్ వెంచర్ ప్రారంభించారు. ఆ తర్వాతి కాలంలో ఆ కంపెనీ మారుతీ సుజుకీగా మారింది. దీనిని ప్రభుత్వం 2002లో ప్రైవేటీకరణ చేసింది. దీంతో పూర్తి స్థాయిలో సుజుకీ అధీనంలోకి వెళ్లిపోయింది. ఆ సంస్థకు 52 శాతానికిపైగా వాటా ఉంది. అలాగే మన దేశంలో ఎంట్రీ ఇచ్చిన తొలి విదేశీ కంపెనీ సైతం సుజుకీ కావడం విశేషం. ప్రస్తుతం ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా మారుతీ సుజుకీ సేవలందిస్తోంది. ఈ సంస్థ తీసుకొచ్చిన మారుతీ 800 దేశీయంగా పెద్ద చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.