క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత బ్రిటన్ రాజుగా ఆమె కుమారుడు మూడో ఛార్లెస్ పట్టాభిషిక్తుడైన విషయం తెలిసిందే. అయితే, కింగ్ ఛార్లెస్ సింహాసనాన్ని త్వజిస్తారా? తన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలిమయ్‌ను రాజుగా కూర్చోబెతారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల తన కోడలు కేట్ మిడిల్టన్‌తో కింగ్ ఛార్లెస్-3 అంతరంగిక సమావేశాన్ని నిర్వహించడం ఆయన మనోగతాన్ని సూచిస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. విలియమ్ భార్య కేట్.. రాణిగా బాధ్యతలను నిర్వహించేందుకు ముందుగానే సిద్ధమవుతున్నట్లు కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆమెతో బ్రిటన్ రాజు సమావేశం కావడం ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
బ్రిటన్ సింహాసనాన్ని ప్రిన్స్ విలియమ్ అధిష్టించే అంశంపై రాజ కుటుంబంలో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేన్సర్ బారినపడిన ఛార్లెస్.. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన రాజుగా తప్పుకుంటారనే ప్రచారం ఊపందుకుంది. కాగా, మార్చిలో నిర్వహించిన ఓ సమావేశంలో కేట్ మిడిల్టన్ మాట్లాడుతూ.. తాను కూడా కేన్సర్ బారినపడినట్టు తెలిపారు. ఛార్లెస్, కేట్ ఒకేసారి కేన్సర్ బారినపడటం.. చికిత్స సమయంలోనే మామ, కోడలికి పరస్పర అనుబంధం బలపడిందని అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. కేన్సర్ నుంచి కోలుకున్న కేట్.. ఇప్పుడిప్పుడే మళ్లీ జనాల్లోకి వస్తున్నారు.
ఇక, రాజుగా బాధ్యతలు చేపట్టేందుకు విలియమ్ సిద్ధమవుతున్నారని రాజకుటుంబానికి అత్యంత సన్నిహితుడు.. బయోగ్రాఫర్ సాలీ బెడెల్ స్మిత్ చెప్పినట్లుగా పీపుల్ పత్రిక ఇటీవల ఓ కథనం ప్రచురించింది. ‘‘ప్రస్తుతం కింగ్ ఛార్లెస్-3 తన విధులను నిర్వరిస్తున్నప్పటికీ.. అనారోగ్యం వల్ల కొన్ని పరిమితులకు లోబడి ఆయన పనిచేయాల్సి వస్తోంది.. దాంతో ప్రిన్స్ విలియమ్‌పై అదనపు బాధ్యతలు పడ్డాయి.. ఈ పరిణామాలను చూస్తుంటే ఊహించిన దానికంటే ముందే విలియమ్-కేట్ బ్రిటన్ రాజు-రాణిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు వారు కూడా ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు’ అని స్మిత్ తెలిపారు.
ఎలిజబెత్-2 మరణం తర్వాత 76 ఏళ్ల ఛార్లెస్-3 రాజుగా బాధ్యతలు చేపట్టినా.. తరచూ ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, కేన్సర్‌కు వైద్యం చేయించుకుండటంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా విలియమ్‌ను రాజుగా కూర్చోబెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.