మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళి అర్పించింది. కాసేపటి క్రితం అంతిమయాత్ర ప్రారంభంకాగా అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది.ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌సింగ్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్ధివ దేహాన్ని తరలించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉదయం 9.30 గంటల వరకు అక్కడే ఉంచారు. మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.ఇక శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తదితరులు ఆయన పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశానికి మన్మోహన్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.