పండుగలు, పబ్బాలు వస్తున్నాయంటే చాలు అనేక షాపింగ్ మాల్స్ అదిరిపోయే ఆఫర్లు పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. వాటిని అందిపుచ్చుకోవడానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తూ.. రచ్చ రచ్చ చేస్తుంటారు. ఎంత మంది ఉన్నా సరే తోసుకుంటూ వెళ్లి మరీ నచ్చినవి కొనుక్కుంటారు. అంత మందిలో తమకు ఏమైనా అవుతుందన్న భయం కంటే కూడా.. ఆఫర్ ఎక్కడ మిస్ అయిపోతామేనని ఎక్కువగా జంకుతుంటారు. సేమ్ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది ఆస్ట్రేలియాలో. కాకపోతే గంటల తరబడి వేచి చూడకుండా అర నిమిషంలోనే ఆ షాపును మొత్తం ఖాళీ చేసేశారు. ఆ విశేషాలు ఏంటంటే..?
ఆస్ట్రేలియా పెర్త్‌లోని "స్ట్రీట్ ఎక్స్" షాపు యజమాని డేనియల్ బ్రాడ్ షా.. ప్రతీ పండుగకు అదిరిపోయే ఆఫర్ ప్రకటిస్తూ.. వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన పెట్టే ఆఫర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఆ షాపింగ్ మాల్‌లో ఎప్పుడు, ఎలాంటి ఆఫర్ పెట్టిన అక్కడి ప్రజలు అస్సలే మిస్ చేసుకోరు. అయితే క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా డిసెంబర్ 26వ తేదీ రోజు డేనియల్ బ్రాడ్ షా.. ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు.
ఆఫర్ అనగానే తక్కువ ధరకే వస్తువులున్నీ ఇస్తున్నారేమో అనుకుంటున్నారమో అంతకు మించిన ఆఫర్ ఇది. ఎవరికి నచ్చిన వస్తువులు వాళ్లు తీసుకుని డబ్బులు కట్టకుండానే ఇంటికి వెళ్లిపోవచ్చు. డేనియల్ బ్రాడ్ షా ప్రకటించిన ఈ ఆఫర్ తెలుసుకున్న ప్రజలు ఉదయమే ఆ షాపింగ్ మాల్ వద్దకు వచ్చారు. వారందరినీ వీధి చివరన నిలబెట్టిన డేనియల్ బ్రాడ్ షా.. షాపింగ్ మాల్ ఓపెన్ చేయగానే వెళ్లమన్నారు. దీంతో వాళ్లంతా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈక్రమంలోనే తొక్కిసలాట కూడా జరిగింది. అనేక మంది కింద పడిపోయారు. అయినా అదేం పట్టించుకోకుండా వెంటనే లేచి షాపులోకి పరుగులు పెట్టారు.
కేవలం అర నిమిషంలోనే అక్కడి ప్రజలంతా ఆ బట్టల దుకాణాన్ని ఖాళీ చేశారు. అనేక రకాల బట్టలతో పాటు మరెన్నో వందల వస్తువులను దోచేశారు. కేవలం 30 సెకన్లలోనే షాపు ఖాళీ అవ్వడం చూసి యజమాని డేనియల్ బ్రాడ్ షా కూడా షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా.. అంతమంది ప్రజలు షాపు ముందు ఉండడం చూసిన పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఏమైందని ప్రశ్నించగా.. డేనియల్ ప్రకటించిన ఆఫర్ గురించి తెలుసుకున్నారు. తొక్కిసలాట జరిగిందని గుర్తించి.. డేనియల్‌ను విచారించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పగా పోలీసులు వెనుదిరిగారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజెన్లు షాక్ అవుతున్నారు. రేయ్ ఎవర్రా మీరంతా అని కొందరు, ఆస్ట్రేలియాలో కరువ్ బ్యాచ్ అంటూ మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఓ నెటిజెన్ అయితే.. ఆఫర్ అంటే చాలు ఇండియా అయినా ఇంకేదేశమైనా ఇలాగే మారిపోతుందంటూ రాసుకొచ్చారు.