భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రోజు 92 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం పాలై కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనేక దేశాలకు చెందిన ప్రముఖులు సైతం స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ముఖ్యంగా భారతదేశ శత్రు దేశమైన పాకిస్థాన్ ప్రజలు కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే.. ఆయన అంత్యక్రియల్లో కూడా పాల్గొనాలని చూస్తున్నారు. మన్మోహన్ సింగ్‌పై పాకిస్థానీలకు ఎందుకంతో ప్రేమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన్మోహన్ పెరిగింది భారతదేశంలోనే అయినా పుట్టింది మాత్రం పాకిస్థాన్‌లోని ఓ కుగ్రామంలో. ఇస్లామాబాద్ వాయువ్య సరిహద్దులకు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న గహ్ అనే ఊళ్లో 1932వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన జన్మించాడు మన్మోహన్ సింగ్. అయితే ఆయన తండ్రి గురుముఖ్ సింగ్ బట్టల వ్యాపారం చేస్తుండగా.... ఆయన తల్లి అమృత్ కౌర్ గృహిణి. తల్లిదండ్రులతో పాటు మన్మోహన్ సింగ్ అక్కడే ఉండి చదువుకున్నాడు. ముఖ్యంగా ఆయనకు ఐదేళ్ల వయసు ఉండగా... 1937 ఏప్రిల్ 17వ తేదీన తొలిసారి పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఇక అప్పటి నుంచి నాలుగో తరగతి వరకు గహ్ గ్రామంలోనే చదువుకున్నారు.
చదువులో ఎంతో హుషారుగా ఉండే మన్మోహన్ సింగ్‌ను గ్రామస్థులు అంతా ప్రేమగా... మోహనా అని పిలుచుకునే వాళ్లట. అయితే కోహ్లీ కులానికి చెందిన సింగ్ కుటుంబం దేశ విభజన సమయంలో అమృత్‌సర్‌కు వెళ్లింది. అలా మన్మోహన్ సింగ్ భారతీయుడిగా మిగిలిపోగా.. ఆయన స్వగ్రామం గహ్ మాత్రం పాకిస్థాన్‌లో కలిసిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన స్వగ్రామం వెళ్లలేకపోయారు. కానీ ఆయన ఇల్లు, చదువుకున్న బడితో పాటు ఆయన రికార్డులు అన్నీ ఇప్పటికీ అక్కడ భద్రంగా ఉన్నాయి.
అయితే 2008లో మన్మోహన్ సింగ్‌తో కలిసి చిన్నతనంలో చదువుకున్న ఆయన స్నేహితుడు రాజా మొహమ్మద్ అలీ సింగ్‌ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చారు. బాల్య స్నేహితుడితో కలిసి అనేక కబుర్లు చెప్పారు. తమతో కలిసి చదువుకున్న అనేక మంది స్నేహితులు చనిపోయిన విషయం తెలుసుకున్న మన్మోహన్ సింగ్ చాలా బాధ పడ్డారు. అయితే సింగ్‌ను కలిసిన రెండేళ్లకే రాజా మొహమ్మద్ అలీ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా మన్మోహన్ సింగ్ చనిపోవడంతో.. ఆ గ్రామస్థులంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తమ కుటుంబ సభ్యుడు చనిపోయినట్లుగానే భావిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ సింగ్‌ను చివరి చూపు చూసేందుకు కూడా నోచుకోలేకపోతున్నామంటూ కన్నీరు పెట్టారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రావాలని ఉన్న కుదరకపోవడంతో రాలేకపోతున్నట్లు గహ్ గ్రామనికి చెందిన సింగ్ స్నేహితుడు రాజా మేనల్లుడు అయిన రాజా అషిక్ అలీ తెలిపారు.