చిన్న పిల్లలు అతిగా అల్లరి చేసినా, చిల్లర తిరుగుళ్లు తిరిగుతూ పరువు తీసేలా ప్రవర్తించినా.. బతిమాలో, భయపెట్టో వారిని మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది. ఎంతో ఓపికగా ఒకటికి రెండు సార్లు వాళ్లకు మంచేదో, చెడు ఏదో వివరిస్తూ.. వారిలో మార్పు తీసుకువస్తుంటారు. కానీ ఆ కన్నతండ్రి మాత్రం ఓపికతో చెప్పలేకపోయాడు. తన కొడుకులు చేసిన చిన్న చిన్న తప్పులకే విసుగు చెంది.. వారి ప్రాణాలు తీశాడు. ఇదెక్కడ జరిగిందో, ఆ పూర్తి కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్ బలరామ్ పూర్‌లోని శంకర్‌పూర్ కాలా గ్రామానికి చెందిన ముఖేష్ గౌతమ్, సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద వాడు అమ్రేష్. అతడికి 11 ఏళ్లు. అలాగే రెండో వాడి పేరు ఆనంద్. ప్రస్తుతం ఇతడి వయసు 7 సంవత్సరాలు. భార్యా, పిల్లలతో చాలా హాయిగా గడుపుతున్న ముఖేష్‌కు ఈ మధ్య కుమారుల ప్రవర్తన ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే అమ్రేష్, ఆనంద్‌లు తరచుగా ఏదో ఒకటి కొనివ్వమని వేధించేవాళ్లు.
డబ్బులు లేవని తల్లిదండ్రులు చెప్పినా వినకుండా వారి జేబులు, పర్సుల్లోంచి డబ్బులు దొంగిలించే వాళ్లు. చాలా సార్లు ఈ విషయం గుర్తించిన ముఖేష్.. పిల్లలకు పద్ధతి మార్చుకొమ్మని చెప్పాడు. కానీ పిల్లలు తండ్రి మాటను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటిలాగే డిసెంబర్ 26వ తేదీ రోజు కూడా కూడా తండ్రిని మిఠాయిలు కొనివ్వమని అడిగారు. అతడు ఒప్పుకోలేదు. డబ్బులు లేవు పక్కకు వెళ్లి ఆడుకోండని చెప్పాడు. కానీ చిన్నారులు ఇద్దరు అతడి జేబులోంచి డబ్బులు లాక్కోబోయారు. దీంతో విసుగు చెందిన ముఖేష్.. మిఠాయిలు కొనిస్తా పదండి అంటూ పిల్లలను బయటకు తీసుకువెళ్లాడు. ఆపై వారు అడిగినవి కొనిచ్చి కెనాల్ వద్దకు తీసుకువెళ్లాడు.
ఆపై ఒక్కొక్కరిగా ఇద్దరు కుమారును కెనాల్‌లోకి విసిరేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు ఇల్లు చేరాడు. అయితే పిల్లలు ఇద్దరూ కనిపించకపోవడంతో అతడి భార్య పిల్లలను వెతకడం ప్రారంభించింది. ఎంత వెతికినా దొరక్కపోయేసరికి మరుసటి రోజు ఉదయమే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరగా పిల్లలను ఎప్పుడు చూశారని ముఖేష్‌ను అడగ్గా.. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడాడు. దీంతో పోలీసులు తమదైన స్టైల్‌లో విచారణ చేపట్టారు.
దీంతో ముఖేష్.. పిల్లలిద్దరినీ తానే కాలువలో పడేసినట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే గజ ఈతగాళ్లను రప్పించి కాలువలో పిల్లల కోసం వెతికించారు. అయితే శుక్రవారం రోజు ఆనంద్ మృతదేహం లభ్యం అయింది. కానీ అమ్రేష్ జాడ మాత్రం ఇంకా దొరకలేదు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండో బాలుడి కోసం గాలిస్తున్నాయి. మరోవైపు భర్తే పిల్లలను చంపాడని తెలుసుకుని సంగీత కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పిల్లలు దొంగతనం చేస్తున్నా మొదట్లో భర్తే ఏమీ అనలేదని.. అందుకే వాళ్లలా చేసేవారంటూ చెబుతూ గుండెలవిసేలా రోదిస్తోంది.
ఇంత చిన్న విషయానికే పిల్లలను చంపడంపై గ్రామస్థులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అతడి మానసకి స్థితి బాగాలేదని.. ప్రస్తుతం అతడు ఓ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నట్లు పలువురు గ్రామస్థులు చెప్పారు. ఇప్పటికే ముఖేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడికి నిజంగానే మానసిక స్థితి బాగాలేదా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.