ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరియాలో హింసాత్మక ఘర్షణలు.. 17 మంది మృతి, 10 మందికి గాయాలు

international |  Suryaa Desk  | Published : Fri, Dec 27, 2024, 09:06 PM

ఇటీవలే తిరుగుబాటుదారులు సిరియాను వారి అధీనంలోకి తీసుకోగా.. అధ్యక్షుడు బషల్ అల్ అసద్ అక్కడి నుంచి రష్యాకు పారిపోయారు. ఇక అప్పటి నుంచి కొత్త ప్రభుత్వమే సిరియాను పాలిస్తోంది. అన్ని గొడవలు తగ్గి దేశం శాంతియుతంగా నడుస్తుందనుకుంటే.. పలు చోట్ల హింసాత్మక ఘటనలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు అసద్ పాలనలో వేలాది మంది ఖైదీలకు అన్యాయంగా మరణశిక్ష విధించిన ఓ అధికారిని అరెస్ట్ చేసేందుకు కొత్త ప్రభుత్వంలోని బలగాలు వెళ్లాయి. ఈక్రమంలోనే రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 17 మంది చనిపోగా.. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.


అసద్ దేశం విడిచి పారిపోయిన తర్వాత నుంచి దేశాధ్యక్ష పదవిని అబు మహ్మద్ అల్ జోలానీ చేజిక్కించుకున్నారు. ఈ ఘటనలో సిరియా ప్రజలు అంతా పండుగ చేసుకున్నారు. 50 ఏళ్లుగా కుటుంబ నియంత పాలను చూశామని.. ఇప్పుడు స్వేచ్ఛగా బతకొచ్చు అనుకుంటూ కలలు కన్నారు. ఆ దిశగానే అల్ జోలానీ ప్రభుత్వం కూడా అడుగులు వేసింది. కానీ తాజాగా జరిగిన ఓ ఘటనలో మరోసారి హింస చెలరేగింది. ముఖ్యంగా అసద్ పాలన సమయంలో సైనిక న్యాయ విభాగం డైరెక్టర్, ఫీల్డ్‌కోర్ట్ చీఫ్‌గా మహమ్మద్ కంజో హాసన్ బాధ్యతలు నిర్వహించారు.


అయితే మహమ్మద్ కంజో హాసన్ అన్యాయంగా అనేక మంది ఖైదీలకు మరణశిక్షలు విధించారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అవసరం లేకపోయినా మరణ శిక్షలు విధిస్తూ.. అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఆ అధికారిని అరెస్ట్ చేయాలని అల్ జోలానీ ప్రభుత్వం బలగాలకు సూచించింది. దీంతో వాళ్లు సదరు అధికారిని అరెస్ట్ చేసేందుకు టార్టస్ ప్రావిన్సులో ఉన్న అతడి ఇంటికి వెళ్లారు. ఈక్రమంలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు.


దీంతో కొత్త ప్రభుత్వంలోని మొత్తం 14 మంది జనరల్ సెక్యూరిటీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ముగ్గురు సాయుధులు కూడా మృతి చెందారు. అంతేకాకుండా మరో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషయాన్ని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమాన్ రైట్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. అసద్ పాలన సమయంలో చివరి 13 ఏళ్లలోనే మొత్తం 5 లక్షలకు పైగా ఖైదీలకు మరణ శిక్షలు విధించారు. దీన్ని చూస్తుంటేనే అసద్ పాలనలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయో, ప్రజలపై ఎంత కఠినంగా వ్యవహరించారో అర్థం అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com