వీకెండ్‌లోనో.. స్నేహితులు కలిస్తేనో.. లేదా ఇంటికి బంధువులు వస్తేనో.. ఎక్కువగా బయట ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ఇందుకోసం జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఉండనే ఉన్నాయి. అయితే.. ఎక్కువగా మీరు ఆర్డర్ చేసే ఫుడ్ ఏదని అడిగితే.. చాలా మంది ఠక్కున చెప్పేది బిర్యానీ అనే. మనమనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. ఇప్పుడు వెలువరించిన వార్షిక రిపోర్టులో ఇదే తేలింది. ఈ సంవత్సరం.. జొమాటోలో ఎక్కువగా ఫుడ్ డెలివరీల్లో బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది. దీనికి సంబంధించి.. 2024 ఇయర్ ఎండ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ నివేదికలోనే ఈ సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ సహా డైనింగ్ ట్రెండ్స్‌ను ప్రస్తావించింది.
>> జొమాటోలో వరుసగా 9వ సంవత్సరంలోనూ బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచింది. ఎక్కువగా 9 కోట్ల మేర బిర్యానీ ఆర్డర్స్ వచ్చినట్లు తెలిపింది. ఈ లెక్కన సగటున సెకనుకు 3 బిర్యానీల చొప్పున డెలివరీ చేసినట్లు తన రిపోర్టులో వెల్లడించింది జొమాటో. ఇక మరో ఫుడ్ డెలివరీ వేదిక అయిన స్విగ్గీలో కూడా బిర్యానీనే టాప్‌లో
నిలిచిందంటే.. బిర్యానీ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
ఇక బిర్యానీ తర్వాత.. ఎక్కువ డెలివరీలు అయిన ఫుడ్ ఐటెమ్‌గా పిజ్జా నిలిచింది. 2024 సంవత్సరంలో మొత్తం 5.84 కోట్ల పిజ్జాల్ని.. జొమాటో దేశవ్యాప్తంగా డెలివరీ చేసింది.
జొమాటో డైనింగ్ సేవల్ని కూడా అందిస్తోంది. దీనికి సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది. ఫాదర్స్ డే రోజు అత్యధికంగా టేబుల్స్ బుక్ అయినట్లు వివరించింది. అత్యధిక స్థాయిలో 1.25 కోట్ల టేబుల్స్ బుక్ అయినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా ఆనంద క్షణాల్ని గడిపేందుకు 84,866 రిజర్వేషన్లు బుక్ చేసినట్లు జొమాటో వెల్లడించింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఒక విషయం తెలుసుకోవాలి. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి.. ఒకే రెస్టారెంట్‌కు వెళ్లి ఏకంగా రూ. 5.13 లక్షల బిల్లు చెల్లించినట్లు వివరించింది. ఇక డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్లు ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది.