సాధారణంగా కొత్త సంవత్సరం సమయంలో కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించడం చూసే ఉంటారు. కానీ, ఈసారి న్యూ ఇయర్ వేళ రిలయన్స్ జియో నెట్‌వర్క్ యూజర్లకు ఊహించని షాక్ తగిలింది. కొత్త ఆఫర్లు పక్కనబెట్టు.. ఉన్న ఆఫర్లను తొలగించేసింది. తమ యూజర్లకు షాకిస్తూ డేటా వోచర్ల వ్యాలిడిటీని తగ్గించేసింది. రోజు వారీ డేటా పరిమితి అయిపోయినప్పుడు అదనపు డేటా కోసం రీఛార్జ్ చేసుకునే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీలో కోత పెట్టేంది. జియో అధికారిక వెబ్‌సైట్లో డేటా వోచర్ల ప్లాన్లు పరిశీలించినప్పుడు కొత్త వ్యాలిడిటీ ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
మొబైల్ యూజర్లు సాధారణంగా రోజుకు 1జీబీ, 1.5జీబీ, 2జీబీ డేటా వచ్చే ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటారు. వాటి వ్యాలిడిటీ 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల అంటూ ఉంటుంది. అయితే, కొన్ని సార్లు రోజు వారీ డేటా సరిపోతుంది. దీంతో రోజువారీ డేటా అయిపోయినప్పుడు ఇంటర్నెట్ సేవలు పొందేందుకు ప్రత్యేక డేటా ప్యాక్స్‌తో అదనపు డేటా కోసం రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. వీటి వ్యాలిడిటీ ఒరిజినల్ ప్లాన్ వ్యాలిడిటీతో సమానంగా ఉంటుంది. అయితే, జియో ఇప్పుడు డేటా వోచర్ల వ్యాలిడిటీని తగ్గించడంతో యూజర్లకు షాక్ తగిలినట్లయింది.
రిలయన్స్ జియో ప్రస్తుతం రూ. 19 ప్లాన్‌తో 1జీబీ డేటా, రూ. 29 వోచర్‌తో 2జీబీ డేటా అందిస్తోంది. ప్రస్తుతం ఈ వోచర్ల వ్యాలిడిటీ తమ ప్లాన్ గడువు ముగిసే వరకు ఉండేది. కానీ, తాజాగా వాటి వ్యాలిడిటీని కుదించింది. రూ. 19 డేటా వోచర్‌తో రీఛార్జ్ చేసుకుంటే వచ్చే 1జీబీ వ్యాలిడిటీ ఒక్క రోజుకు పరిమితం చేసింది. అంటే ఒక్కరోజులోనే 1జీబీ ఉపయోగించుకోవాలి. లేదంటే ల్యాప్స్ అయిపోద్ది. ఇక రూ. 29 ప్లాన్ గడువును రెండు రోజులుగా నిర్ణయించింది. ప్రస్తుతం అతి తక్కువ ధరలో రూ. 11తో మరో డేటా వోచర్ అందుబాటులో ఉంది. దీని వ్యాలిడిటీ కేవలం 1 గంట మాత్రమే. ఈ గంట వ్యవధిలో అన్‌లిమిటెడ్ డేటా ఉంటుంది.