కేసీఆర్ అంటే ఒక పేరు కాదు.. కేసీఆర్ అంటే ఒక పోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలు పెట్టి.. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. దీక్షా దివాస్ సందర్భంగా కరీంనగర్‌లోని అల్గునూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్ అని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్‌లో జరిగిన సింహా గర్జన ద్వారానే కేసీఆర్ దేశానికి పరిచయమ్యారు. ఎక్కడుంది తెలంగాణ అన్నోళ్లకు ఆనాటి లోక్‌సభ ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీ ఇచ్చి తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో ఇక్కడి ప్రజలు చూపించారు. 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నప్పుడు చాలా మంది అవమానకరంగా మాట్లాడారు. తెలంగాణ వాదం ఇక లేదని అన్నారు. కానీ కేసీఆర్ ఇదే కరీంనగర్ వేదికగా నా శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో అంటూ గర్జించారు. అలాంటి కరీంనగర్ గడ్డకు, కరీంనగర్ బిడ్డకు వందనం తెలియజేస్తున్నా. కరీంనగర్ ప్రజల పోరాట స్ఫూర్తి లేకుంటే తెలంగాణ సిద్ధించేదో లేదో తెలియదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి 15 ఏళ్లు గడిచిన సందర్భంగా ఇవాళ అని కేటీఆర్ గుర్తు చేశారు. మనం ఎటు పోవాలో తెలుసుకోవాలంటే.. ఎక్కడ ప్రారంభమయ్యామో తెలుసుకోవాలని కేసీఆర్ నిత్యం చెబుతుంటారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక్కో మాట తూటా లాగా పేలింది. రాజకీయ వేదికల ద్వారానే తెలంగాణ సాధిస్తామని ఆయన చెప్పారు. అప్పట్లో 8 ఏళ్లు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్రాతో కలిపారు. తెలంగాణను ఆంధ్రాతో కలిపినప్పుడు ఒక అమాయక అమ్మాయికి.. హుషారైన అబ్బాయి చేస్తున్న పెళ్లి ఇదని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిజామాబాద్ వేదికగా అన్నారు. ఈ బంధం బాగుంటే సరే.. లేదంటే ఎప్పుడైనా విడిపోవచ్చని చెప్పారు. ఆనాడే ఇష్టంలేని పెళ్లి చేసినట్లు ఆయనే అంగీకరించారని కేటీఆర్ తెలిపారు.