నారాయణ కాలేజీలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో తనుష్ నాయక్ (16) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనుష్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. లెక్చరర్ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పుత్రుడిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.విషయం తెలుసుకున్న యాజమాన్యం హుటాహుటిన విద్యార్థిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందాడని తెలియడంతో విద్యార్థి బంధువులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే యాజమాన్యం వేధింపుల కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు.